ఎల్‌ఐసీ ఏజెంట్ల హక్కులను కాపాడుకుందాం

ఎల్‌ఐసీ ఏజెంట్ల హక్కులను కాపాడుకుందాం– 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్‌ఐసీని రక్షించుకోవడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లు ఐక్యంగా పోరాటాల్లోకి రావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఎస్‌కేఎమ్‌ ఈ నెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను, గ్రామీణ భారత బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసీ ఏఓఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌వీఎన్‌ రెడ్డి అధ్యక్షతన ఎల్‌ఐసీ ఏజెంట్ల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ..
మోడీ సర్కారు ఆర్ధిక విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ చర్యలతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు బలహీనపడుతున్నాయన్నారు. ప్రభుత్వరంగాన్ని ఆధారం చేసుకొని విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయనీ, భారతదేశ స్వావలంబనను బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వరంగమంటే కేవలం ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాలను మాత్రమే చూడటం పాక్షిక దృష్టేనని అన్నారు. దేశ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు లభ్యమవుతున్న అంశాన్ని విశాల దృష్టితో చూడాలని కోరారు. ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఎల్‌ఐసీ ఏఓఐ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల వల్ల కోట్లాది ప్రజల ప్రజా ధనానికి భద్రత లభిస్తున్నదనీ, వాటి ద్వారా సమాజంలో అణగారిన తరగతుల హక్కులను, సామాజిక న్యాయం కొంత మేరకు కాపాడుకోగలిగామని అన్నారు. దేశ ఆర్ధిక సార్వభౌమత్వం, ప్రజల ఐక్యత కోసం శ్రమజీవులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బ్రాంచి స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎల్‌ఐసీ ఏజెంట్లను ప్రత్యక్షంగా కలిసి కరపత్ర ప్రచారంతో పాటు సదస్సులు, సమావేశాలు, సంతకాల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.