త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పెడదాం

Let's put full stop soon‘జరుగుతున్న పరిణామాల కంటే రేవతి కుటుంబ సభ్యులకు అందరం అండగా ఉండటం ముఖ్యం’ అని నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు అన్నారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంగళవారం దిల్‌రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘గత కొన్ని రోజులుగా అటు ప్రభుత్వం వైపు, ఇటు ఇండిస్టీ వైపు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా. నా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కోసం అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు రాలేకపోయా. అమెరికా నుంచి రాగానే ముఖమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశాను. రేవతి భర్త భాస్కర్‌కు పరిశ్రమ తరఫున ఉపాధి కల్పిస్తానని ఆయనకు చెబితే, మంచిదన్నారు. అలాగే ఎటువంటి సమస్యలు లేకుండా చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి వారధిగా ఉండమని చెప్పారు. రేవతి కుటుంబానికి అండగా ప్రభుత్వం కూడా ఉంటుందని సీఎం అన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్‌ పరిస్థితి మెరుగవుతోంది. గత రెండు రోజుల నుంచి వెంటీలేటర్‌ తీసేశామని డాక్లర్లు చెప్పడం కొంత ఉపశమనం కలిగించింది. త్వరలోనే శ్రీతేజ్‌ కోలుకోవాలని ఆశిస్తున్నా. అలాగే భాస్కర్‌ కుమార్తెతోపాటు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను అండగా నిలబడతాను. సంధ్య థియేటర్‌ ఘటన ఎవ్వరూ కావాలని చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగింది. ఎన్నో సినిమా వేడుకలు జరుగుతుంటాయి. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇలాంటివి కూడా జరగకుండా చూసుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతోందనేది అవాస్తవం. దుష్ప్రచారం చేస్తున్నారంతే. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. ఈ రెండు రోజుల్లోనే ఆయన్ని కలుస్తాం. అలాగే అల్లుఅర్జున్‌ని కూడా కలిస్తా. త్వరలోనే అన్నింటికి పుల్‌స్టాప్‌ పెడదాం’ అని తెలిపారు.