– రుణమాఫీ కాని రైతులకు అండగా ఉంటాం : బీజేపీ హెల్ప్‌లైన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఊరూరా రచ్చబండ పెడ్డామనీ, రుణమాఫీ కాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షల లోపు రుణాల మాఫీ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆంక్షల పేరుతో మోసం చేస్తున్నదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రుణాలు మాఫీ కాని బాధిత రైతులకు అండగా నిలిచేలా, రైతుల పక్షాన ‘కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేరుతో పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేశారు. అనంతరం హెల్ప్ లైన్ నంబర్ – 8886 100 097ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి వారికి సాయం అందించేలా కార్యాచరణ చేపట్టబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. ఏ రైతులకు, ఏ ప్రాతిపాదికన రుణాలు మాఫీ చేస్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అనేక మంది రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకుల్లో డీఫాల్డర్‌గా మారే ప్రమాదం ఉందని వాపోయారు. రైతులకు పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.15వేల ఆర్థిక సహాయం ఏమైం దని నిలదీశారు. గ్యారంటీల పేరుతో గారడీలు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని విమర్శించారు. విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇప్పుడు 7.6 శాతమే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్లను, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ తరఫున క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.