పుస్తకం చదువుదాం

Let's read the bookపుస్తకం ఓ భాండాగారం. భాషకూ, భావానికీ, వ్యక్తీకరణకూ పుస్తకం ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞాన పరంపరను వారసత్వంగా అందిస్తున్న మాధ్యమం పుస్తకం. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర చాలా గొప్పది, విశిష్టమైనది. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాలను, ఉద్యమాలను, ఉద్వేగాలను, విలువలను ఒక్కటేమిటి మనిషి సమస్త మార్పులకు పుస్తకాన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి పుస్తకాలు అనేక మందికి చేరడం, విస్తృతంగా చదవడం అత్యంత అవసరం. పెరిగిన సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు పుస్తకాలను మనకు దూరం చేస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.
‘పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందని ఇచ్చిపుచ్చుకునే నెపం మీద మాటలు కలిపి, ఏర్పర్చుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో’ అంటూ నేటి తరం పుస్తకాలకు దూరమవుతున్న పరిస్థితిని చూసి ఆవేదనతో రాసుకున్నారు ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌. ఆయన అన్నట్టు 21వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నది. ముఖ్యంగా గత దశాబ్దకాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా మాధ్యమాలు విరివిగా ఉపయోగించడం పెరిగిపోయింది. అంతా చూడటమే. టీవీ, సినిమా, కంప్యూటర్‌ చూస్తారు. స్మార్ట్‌ఫోన్‌ను మాట్లాడానికంటే బొమ్మలు, వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అన్నీ చూడటమే. అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్‌లను వాడే సంస్కృతిని వచ్చేసింది. అయితే ఈ చూడటం అనేది పెరిగిపోవడం వల్ల సమాజంపై దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. పిల్లలు, యువత పక్కదోవ పడుతున్నారు. కానీ ఈ విషయంపై అవగాహన మాత్రం ఉండడంలేదు.
నేటి రోజుల్లో పుస్తకం చదవడం అంటే కాలేజీల్లో మార్కులు, ర్యాంకులు సాధించడం, లైబ్రేరీల్లో పోటీ పరీక్షలకు సిద్ధం కావడం అనుకుంటారు. దీని వల్ల మానవీయ విలువల ప్రాధాన్యం తగ్గిపోతుంది. సమాజంపై అవగాహన లేకుండా పోతుంది. నేటి సాంకేతికత కూడా తాత్కాలికంగా పుస్తకాన్ని మరుగునపర్చినట్టు కనిపిస్తున్నది. సాంకేతికతను సరైన దిశలో వియోగించగలిగితే భౌతికంగా పుస్తక రూపాన్ని మింగేయవచ్చు కానీ భాషనూ భావాలనూ మింగేయలేదు.
సాంకేతికత దాని పర్యవసానాలను పక్కనపెట్టి చదివే అలవాటును ఎట్లా పెంచాల్నో ఆలోచించి అమలుచేయాలి. పుస్తకాలు చదవడం వల్ల కలిగే వ్యక్తిగత పరిణామమూ, పెరిగే అవగాహననూ యువతకు, పిల్లలకు అర్థం చేయించాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకొని, మనసు లోపల ఇమిడించుకోవడంలో ఉన్న ఆనందాన్ని అర్థం చేయించాల్సిన అవసరం చాలా ఉంది. అది ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలల్లో, గ్రంథాలయాల్లో జరగాల్సిన పని. తల్లిదండ్రులు కూడా బాధ్యతతో పిల్లలకు చదివే అలవాటు నేర్పించాలి. నేటి పరిస్థితులకు అనుగుణంగా లైబ్రరీలలో, ఈ-గ్రంథాలయాలూ, డిజిటల్‌ గ్రంథాలయాల వంటి ఆధునిక వసతులు కల్పిస్తూనే విద్యార్థుల్లో, యువతలో చదివే అలవాటును పెంపొందించే కార్యక్రమాలు జరగాలి. వారిలో చదివే సంస్కృతిని పెంపొందించాలి. దానికి ప్రధానంగా తరగతి గదులు గ్రంథాలయాలూ వేదికలు కావాలి. దీనిపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. సామాజిక బాధ్యతను గుర్తెరగడానికి పాఠ్య పుస్తకాలే కాకుండా సాహిత్యం, చరిత్ర లాంటి అనేక అంశాల పుస్తకాలు చదవాలని టీచర్లు చెప్పగలిగితే విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది, పుస్తకాల మీద ప్రేమ కలుగుతుంది.