
– జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఉప్పు వాడకం అధికం కావడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వైద్య సిబ్బందికి బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తపోటుని తరచుగా పరీక్షించుకోవాలని , అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజు తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలియజేశారు.ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపారు. 5 గ్రాముల పరిమితి కంటే ఉప్పు తీసుకుంటే అధిక ముక్కు ఉంటుందని ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియో పోరోసిస్, మెనియర్స్, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. అధిక ఉప్పు వాడకం వల్ల బీపీ పెరిగి మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు. తాజా, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని సూచించారు.జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ జయ శ్యాంసుందర్ , సాంబశివరావు, అంజయ్య, శ్రీనివాస్ , యమున, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..
గిరిజన మంత్రిత్వ శాఖ,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గిరిజన అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం కోసం అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.2024-25 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మాస్టర్స్, పి.హెచ్.డి, రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఓఎస్ స్కాలర్షిప్ అందిస్తుంది అని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోపు https://overseas.tribal.gov.in ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.