ఎన్‌ఈపీని తిరస్కరిద్దాం

Let's reject NEP– విద్యార్థి నేతల పిలుపు
– స్టూడెంట్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ పార్లమెంట్‌ మార్చ్‌
– ఢిల్లీలో కదంతొక్కిన విద్యార్థి లోకం
మోడీ ప్రభుత్వ విధానాల వల్లే విద్య నిర్వీర్యమవుతోందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించాలని దేశంలోని విద్యార్థి లోకానికి 16 విద్యార్థి సంఘాల నేతలు ఉమ్మడిగా పిలుపునిచ్చారు. ”దేశాన్ని రక్షించాలంటే, బీజేపీని ఓడించాలి. విద్యను పరిరక్షించాలంటే, నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) తిరస్కరించాలి” అంటూ విద్యార్థులు గర్జించారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అఖిల భారత స్థాయిలో ఏర్పాటైన స్టూడెంట్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ పార్లమెంట్‌ మార్చ్‌లో వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు ”ప్రభుత్వ విద్యను కాపాడాలి. విద్యా ప్రయివేటీకరణ, కాషాయికరణ, కార్పొరేటీకరణ ఆపాలి. ఉచిత నిర్బంధ విద్యను పకడ్బందీగా అమలు చేయాలి. విద్యా సంస్థల్లో మతోన్మాద చర్యలు ఆపాలి. విద్యా సంస్థల స్వతంత్రతను కాపాడాలి” అంటూ నినాదాలు హౌరెత్తించారు. ఎన్‌ఈపీ, సీయూఈటీ వంటి క్రూరమైన విద్యా విధానాలను ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎందుకు పతనమైపోతోందో, ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను అమలు చేస్తోందో సమాధానాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడిక్కడ ఎస్‌ఎఫ్‌ఐ సహా పదహారు విద్యార్థి సంఘాలు నిర్వహించిన స్టూడెంట్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు దేశ రాజధానికి తరలివచ్చారు. ఉమ్మడి విద్యార్థుల మార్చ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం తమ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల నుండి బయలుదేరే ముందు పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు మార్చ్‌లో పాల్గొనకుండా నిరోధించడానికి బీజేపీ వివిధ విశ్వవిద్యాలయ పరిపాలనలను ఉపయోగించింది. ఢిల్లీ పోలీసులు తమ యంత్రాంగాన్ని ఉపయోగించి అనుమతి నిరాకరించి సభ జరగకుండా అడ్డుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలన్నింటినీ తిరస్కరించడంతో పాటు వేలాది మంది విద్యార్థులు ఎన్‌ఈపీ, బీజేపీలకు వ్యతిరేకంగా కవాతు నిర్వహించారు.
మోడీ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను సహించం
జంతర్‌ మంతర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీకి ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు వి.పి సాను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శించారు. విద్యార్థులను, ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడమే వారి ఎజెండా అని దుయ్యబట్టారు. దేశ లౌకిక, సమాఖ్యవాదాలను ధ్వంసం చేసే ఏ చర్యనూ విద్యార్థులు అంగీకరించబోరని అన్నారు. విద్యను పెట్టుబడిదారులకు అమ్మాలని భావిస్తున్న ఈ బీజేపీని తాము అంగీకరించబోమని అన్నారు. ఫిబ్రవరి 1న చెన్నైలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాముడు పేరుతో బీజేపీ దేశాన్ని దోచుకుంటోందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌ విమర్శించారు. ఎన్‌ఈపీ వంటి వాటితో విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఫెలోషిప్‌, స్కాలర్‌షిప్‌ల రద్దుతో పేదలకు విద్యను దూరం చేసే కుట్రను మోడీ సర్కార్‌ పన్నుతోందని విమర్శించారు. ఎన్‌ఈపీ, బీజేపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యామ్నాయ విద్యా విధానాల ఆవశ్యకతను ఎఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి దినేష్‌ శ్రీరంగరాజ్‌ వివరించారు. ఎఐఎస్‌ఎ ప్రధాన కార్యదర్శి ప్రసేన్‌జిత్‌ బోస్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా నోరు విప్పాలని అన్నారు. విద్యార్థులను ఆత్మహత్యలకు పురికొల్పే నీట్‌ పరీక్షను నిలిపివేయాలని డీఎంకె విద్యార్థి విభాగం నేత, ఎమ్మెల్యే ఎజిలరసన్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సౌమ్యదీప్‌ సర్కార్‌ (ఎఐఎస్బీ), ప్రియాంక భారతి (సీజేఆర్డీ), అనురాగ్‌ నిగమ్‌ (సీవైఎస్‌ఎస్‌), ప్రిన్స్‌ ఎన్నారెస్‌ పెరియార్‌ (ద్రవిడియన్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌), అనఘ ప్రదీప్‌ (డీఎస్‌ఎఫ్‌ కార్యదర్శి), చిన్న తంబి (ఎన్‌ఎస్‌ యుఐ) , రాందాస్‌ ప్రిని శివానందన్‌ (పిఎస్‌ఎఫ్‌), నౌఫల్‌ సైఫుల్లా (పిఎస్‌ యు), అమన్‌ పాండే (ఆర్‌ఎల్డి ఛత్రసభ), ఇమ్రాన్‌ (సమాజ్‌వాదీ ఛత్రసభ), దేవబ్రత సైకియా (సత్రో ముక్తి సంగమ సమితి), సుజిత్‌ త్రిపుర (టీఎస్‌యూ) కూడా ప్రసంగించారు.
డిమాండ్లు
– ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి దీప్సితా ధర్‌ డిమాండ్‌ చార్టర్‌ను చదివి వినిపించారు.
-”ఫీజుల పెంపును ఉపసంహరించాలి.
– పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలి.
– రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకురావాలి.
– కుల, ఆర్థిక ఆధారిత వివక్షను ఆపాలి.
– విద్య, ఉపాధిలో ఎస్సీ, ఎస్టీ, ఒబీసీి, ఇతర అట్టడుగు వర్గాల హక్కులు,అవకాశాలను పరిరక్షించాలి.
– ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.
– అందరికీ విద్య, ఉపాధి హామీ కోసం భగత్‌ సింగ్‌ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి.
– అన్ని క్యాంపస్‌ల్లో జిఎస్‌ క్యాస్‌ని ఏర్పాటు చేయాలి, అన్ని విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్ష లేకుండా చేయాలి.
– లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విద్యా సంస్థల్లో కమిటీలను ఏర్పాటు చేయాలి.
– అన్ని క్యాంపస్‌లలో విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించాలి.
– విద్యార్థి సంఘాల ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి.
– అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి” అని పార్లమెంట్‌ మార్చ్‌ డిమాండ్‌ చేసింది.