గద్దర్ అన్న యాదిలో… స్మరించుకుందాం..

Let's remember in Gaddar Anna Yadi...నవతెలంగాణ – రాయపోల్
సమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నను స్మరించుకుందామని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు ఆస శ్రీరాములు అన్నారు.శనివారం గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి గోడపత్రికను సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, టీపిసిసి రాష్ట్ర నాయకులు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 6 న హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గద్దర్ యాదిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక, కార్మిక, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన యుద్ధనౌకను ప్రజలందరూ స్మరించుకునేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఆశయాల మార్గంలో జీవితాంతం దళిత బహుజన బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్య చేయడమే లక్ష్యంగా పోరాటం చేశారు. గజ్వేల్ ప్రాంతంలో అణచివేత అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు గద్దర్ అన్నారు. గ్రామాలలో కొనసాగే వెట్టిచాకిరి విముక్తి కోసం అడవి బాటపట్టి పేద ప్రజల పక్షాన పోరాటం చేశారన్నారు.గద్దర్ అన్న తన మాట- పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన గొప్ప కళాకారుడు. దేశవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజల కోసమే తన ఊపిరి ఉన్నంతవరకు ఉద్యమించిన ప్రజా ఉద్యమ కారుడు గద్దర్ అన్నను స్మరించుకోవడానికి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోచ సంఘం రాష్ట్ర కార్యదర్శి మోచ వేణు, రాయపోల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, అంబేద్కర్ యువజన సంఘం చిప్పల యాదగిరి, ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్,తుమ్మ యాదగిరి, జర్నలిస్టులు పోతరాజు కనక స్వామి, మన్నె గణేష్, ఆస శ్రావణ్, గాలేంక రాజు తదితరులు పాల్గొన్నారు.