స్వతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం..

– కొలను శంకర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్
నవతెలంగాణ – మీర్ పేట్
భారత స్వాతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరులను స్మరించుకోవాలని బాలాపూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ అమృత్ మహోత్సవాల మహేశ్వరం నియోజకవర్గం కోఆర్డినేటర్ కొలను శంకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మీర్ పేట్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం “అజాదిక అమృత్ మహోత్సవం” లో “మన దేశం-మన మట్టి” కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరిస్తూ మట్టిని పూజించాలన్నారు. స్వాతంత్ర పోరాటంలో అమరవీరులను స్మరిస్తూ వారి కుటుంబాలకు సత్కారాలు చేయాలని అన్నారు. మన దేశం కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను అండగా ఉంటూ ఆదుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు. ఈనెల 11,12వ తేదీలలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులను వారి కుటుంబాలను గుర్తించి సమున్నతంగా సత్కరించాలన్నారు. అమరవీరులకు వందనాలు, నివాళులు అర్పిస్తూ 13వ తేది నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని, 16నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో మట్టిని తీసుకొని దేవాలయాల్లో పూజించి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు వారసత్వ రాజకీయాలను విడనాడాలని, అమరుల త్యాగ ఫలాలను అందరికీ అందించేందుకే అమృత త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ్మ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంద్ర పార్క్ వద్ద జరుగుతున్న ధర్నాను విజయవంతం చేసేందుకు బిజెపి నాయకులు శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, సూల ప్రభాకర్, యాదగిరి యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.