అన్నదాతని గౌరవిద్దాం..!

Let's respect the breadwinner..!మన్ను నుండి అన్నమై మొలకెత్తి
కడుపు నింపినా
మట్టిమనిషని దూరం పెట్టే ఆధునికులం
చెమట కుర్సి ముద్దపంట మొల్చిన పొలాల్లో
రియల్‌ ఎస్టేట్‌ ఉక్కుపాదంతో దుక్కిదున్ని
నోట్ల పంటకు ఆశలు చల్లే స్వార్ధపరులం
దుమ్ముకొట్టుకుపోయిన పల్లెలు
గొడ్డుగోదా గోచీరైతుని చూసి
వెలపరించుకొనే చదువుకున్న మూర్ఖులం
మట్టికి ప్రాణం పోసి, మనిషికి ప్రాణం నిలిపే బ్రహ్మ
కర్షకుడేనని తెలుసుకుందాం
కురిసే వర్షాల్లో మెరిసే మెరుపుల్లో
రాలే పిడుగుల్లో ఎండల్లో చలిలో
పంటల్ని చంటి పిల్లల్లా కావులించుకొని
కాపుకాసేది మనకోసమేనని గుర్తిద్దాం
గొడ్డుల్ని బిడ్డల్లా సాకి, బిడ్డల్ని గొడ్డుల్లా శ్రమపెట్టి
వెన్న జున్ను మనకే ఇచ్చిన త్యాగశీలతకు నమస్కరిద్దాం
ప్రకతితో జతకట్టి మమేకమై పచ్చి కంకుల్ని వెచ్చగా సాకేది
ఆ పరమాన్నం రుచితో మన జిహ్వని
చవులూరించేటందుకేనని గ్రహించి హర్షిద్దాం
పనిముట్లకు సానబెట్టి, నేలతల్లికి పదును పెట్టి
ఏరువాక సాగిన నాటినుండి తనే జీవశాస్త్రమై
మొలకెత్తే గింజగింజలో పరకాయ ప్రవేశం చేసి
పుడమిని సస్యశ్యామలం చేసేది
భూజనులకు భోజనం కొరత తీర్చేటందుకేనని
తెల్సుకుని గౌరవిద్దాం..
(డిసెంబర్‌ 23 జాతీయ రైతు దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253