చరిత్రను తిరగరాద్దాం

Let's reverse history– రంగన్నను గెలిపించండి
– కమ్యూనిస్టుల్ని చట్టసభలకు పంపిద్దాం
– మోడీని దించితేనే భవిష్యత్తు
– పొత్తులు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణం
– వ్యాపారంగా మారిన ఎన్నికలు : మిర్యాలగూడ రోడ్‌ షోలో సీతారాం ఏచూరి
– వేములపల్లి నుంచి వాడపల్లి వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ- మిర్యాలగూడ
ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, మోడీని గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తు ఉందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాని కోసం అందరూ కరకణబద్దులు కావాలని తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వేములపల్లి నుంచి వాడపల్లి వరకు వేలాది వాహనాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్‌ పేట ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుండి రాజీవ్‌ చౌక్‌ వరకు రోడ్‌ షో సాగింది. రెడ్‌షర్టులు ధరించి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎరువుమయమయింది. ఓపెన్‌టాప్‌ జీపులో ఏచూరి, జూలకంటి రంగారెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం రాజీవ్‌చౌక్‌లో జరిగిన కర్నార్‌ మీటింగ్‌లో ఏచూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదలను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా అప్పజెప్పుతూ ప్రజాసంక్షేమాన్ని మరిచిందని విమర్శించారు. దేశంలో ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని, కొనుగోలు శక్తి రోజురోజుకూ పడిపోతుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని, పౌర హక్కులను రద్దు చేసి తమ సొంత ఏజెండాను ప్రజలపై రుద్దేందుకు చూస్తోందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. దీనికోసం ప్రజలందరూ ఏకమై భవిష్యత్తులో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ఆహార భద్రత అందకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని తెలిపారు. నేడు పాలకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని, డబ్బు ఉన్న వారే పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పదవుల కోసం పార్టీల ఫిరాయింపులు చేస్తున్నారని, అలాంటి వారిని ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో తమ పార్టీ ఉందని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లోనే సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఎన్నికలు ఎంతో కీలకంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 19 చోట్ల పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. మీకోసం మీ రంగన్నను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తీగల సాగర్‌, శ్రీరామ్‌ నాయక్‌, రమ, ఎంవీ రమణ, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్‌, డాక్టర్‌ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, నూకల జగదీష్‌ చంద్ర, పరశురాములు, ఐలూ రాష్ట్ర కార్యదర్శి అనంతుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.