– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మహానగరంలో మతసామరస్యాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల సికింద్రాబాద్ దేవాలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటన అత్యంత విచారకరమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దానిపై ఇంకా ఉద్రిక్తతలు కొనసాగడం దురదృష్టకరమనీ, మతాల మధ్య విద్వేషాలు పెరగకుండా మత పెద్దలు, మేధావులు కృషి చేయాలని కోరారు. ఘటనకు కారకులు, వారి వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత మౌఢ్యంతో వ్యవహరించే వారు ఏ మతస్తులైనా వదిలిపెట్టవద్దని కోరారు. అన్ని మతాల వారితో శాంతి కమిటీలు వేసి ప్రజల్లో సామరస్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన రెండు దశాబ్దాలకుపైగా హైదరాబాద్ నగరంలో హిందూ, ముస్లింలు సామరస్యంతో ఉంటున్నారనీ, ఇతర నగరాల్లో మాదిరిగా విద్వేషంతో కూడిన హింసా ఘటనలు జరగలేదని తెలిపారు.