ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా కాపాడుతాం

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా కొత్త ప్రభుత్వం కాపాడుకుంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో ఆటో డ్రైవర్లు బాధపడుతున్నట్టు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అన్ని సంఘాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను చర్చలకు ఆహ్వానిస్తామన్నారు. మంత్రి అయ్యాక ఆయన మొదటిసారి ఆదివారం గాంధీభవన్‌కు వచ్చారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్యారంటీలను చేయడంలో కాంగ్రెస్‌పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి కమిట్‌మెంట్‌ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంగా ఉండదని భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండు అమలు చేశామని తెలిపారు. తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ప్రతి రోజు 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని వివరించారు. ఈ పథకం రవాణా శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ శాఖ మంత్రిగా చాలా సంతోషంగా ఉందన్నారు. సచివాలయం, ప్రగతిభవన్‌కు వచ్చేందుకు గత పాలకులు ప్రజలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. వాటిని పూర్తిగా కొత్త ప్రభుత్వం మార్చిందని తెలిపారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నామనీ, అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని పొన్నం వెల్లడించారు.