– ప్రత్యేక లాంచీలను నడపనున్న టూరిజం శాఖ
– చరిత్రకు సజీవసాక్ష్యం ఏలేశ్వరం గట్టు
– పెద్దలకు 200రూ,పిల్లలకు 150రూ,ల టికెట్ ధర
– గుట్టకు అధిక సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో.. నాగార్జున కొండకు సమీపాన ఉన్న ఏకైక కొండ ఏలేశ్వరం. సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లను ఆహ్వానిస్తున్నట్లు నదీ ముఖంగా.. అత్యద్భుత ప్రకృతి సౌందర్యాన్ని కలిగిన రెండు శిఖరాలు కలిగి ఏకైక గుట్టగా విరాజిల్లుతోంది. గుట్ట పైన స్థానం లేక వేల ఏళ్ల క్రితం ఈ కొండ పాదాల చెంతనే నూటొక్క గుళ్లు.. ముక్కోటి దేవతల విగ్రహాలు, చెక్కిన కోటొక్క శిలలు ఉండేవని స్థానిక స్థల పురాణం చెప్తోంది. సాగర్ జలాశయ నిర్మాణానికి ముందు 1962 వరకు నిత్య పూజలు అందుకున్న ఇక్కడి కొండ.. ప్రాజెక్టు నిర్మాణంతో ఒంటరయ్యింది. ముంపునకు ముందు చేపట్టిన తవ్వకాల్లో ఏలేశ్వరం వద్ద లభించిన వందలాది చారిత్రక శాసనాలు, వేలకొలది దేవతా విగ్రహాలు ఇప్పటికీ పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పురావస్తు శాఖ మ్యూజియాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వేల ఏళ్లనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
అత్యద్భుత ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న ఏలేశ్వరం కొండ: నేటి రెండు తెలుగు రాష్ర్టాలను అన్నపూర్ణగా మార్చిన సాగర్ ప్రాజెక్టు నిర్మాణం 60ఏళ్ల క్రితమే ప్రారంభం కాగా.. ఈ బృహత్ జలాశయం విస్తీర్ణం అంతా ఇంతా కాదు. వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 4మండలాల మేర కృష్ణా నీటి పరవళ్లను నందికొండ వద్ద బంధించిన నిర్మాణమే.. నేడు మనం చూస్తున్న నాగార్జున సాగరం. ఈ జలాశయం మధ్యలోనే అలనాటి బౌద్ధ విశ్వవిద్యాలయ ఆనవాళ్లు పొందుపర్చుకున్న నాగార్జున కొండ ఉన్న విషయం తెలిసిందే. కానీ దానికి కొద్ది దూరంలోనే అంతకంటే ఎక్కువ చారిత్రక నేపథ్యం, విస్తృతమైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన ఏలేశ్వరం గుట్ట ఉందన్న సంగతి ఎవరికీ తెలియకపోవడమే విచారకరం.కాత్యాయనీ సహిత మల్లికార్జునస్వామి వార్ల ఆలయాలతో కూడిన ఏలేశ్వరం మల్లన్న గుట్ట సాగర్ ఆనకట్టకు సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉంది. చందంపేట మండలం బుగ్గతండా, పొగిళ్ల గ్రామాలకు సమాన దూరంలో ఉంటుంది. జలాశయంలో తొలిసారి నీటిని నింపిన నాటి నుంచి ఈ గుట్టకు రాకపోకలు బంద్ అయ్యాయి. నాగార్జున కొండలో బుద్ధుడు, నాగార్జునుడి ఆనవాళ్లను పొందుపరిచి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన నాటి సమైక్య ప్రభుత్వాలు.. అంతకు మించిన చారిత్రక ప్రాముఖ్యతను.. వేల ఏళ్ల క్రితమే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఏలేశ్వరాన్ని విస్మరించాయి.
ఏటా రెండుసార్లు మాత్రమే లాంచీలు: ఏలేశ్వరం గుట్టపైన సరిపడా స్థలం లేనందున కింద 101 ఆలయాలు.. ముక్కోటి దేవతల విగ్రహాలు చెక్కిన కోటొక్క శిలలు ఉండేవని చెప్తుంటారు. పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన వేలాది విగ్రహాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీశైలానికి సరైన రహదారి మార్గం లేక.. అక్కడికి వెళ్లలేని ఎక్కువ మంది భక్తులు ఏలేశ్వరంను సందర్శించేవారని.. అప్పట్లోనే దక్షిణ కాశీగా ఏలేశ్వరం ప్రసిద్ధి చెందిందని ముంపు గ్రామాల ప్రజలు నేటికీ చెప్పుకుంటుంటారు.ప్రతి ఏటా ఏకాదశి, శివరాత్రి సందర్భంగా రెండు, మూడు రోజులపాటు ప్రత్యేకంగా లాంచీలు ఏర్పాటు చేయడంతో భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసంలోనూ లాంచీలు నడిపేందుకు అనుమతి లభించినా.. ప్రస్తుతం అవి చేపట్టడం లేదు. మిగిలిన సమయాల్లో మాత్రం ఇక్కడికి వెళ్లాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని.. ప్రైవేటు పడవల్లో వెళ్లాల్సిందే.దక్షణ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న ఏలేశ్వరం గ్రామం చరిత్ర ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పర్వతం మీద కాత్యాయని సమేత ఏలేశ్వరస్వామి దేవాలయం నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో చరిత్రక ఏలేశ్వరస్వామి క్షేత్రం, శివరాత్రినాడు మాత్రమే ప్రత్యేక లాంచీలు, సంతనస్వామి చెంతకు చేరుకునే అరుదైన అవకాశం. ప్రకృతి అందాల నడుమ జూలు విప్పిపడుకున్న సింహం ఆకారంలో కొండగట్టు ఉంటుంది.
ఆలయ విశిష్టత: నాగార్జునసాగర్ జలాశయం మధ్యలోనికి కాత్యాయనీ ఏలేశ్వరస్వామిక్షేత్రం ఎంతో మహిమానిత్యం గలదని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 1962కు ముందు ప్రతి ఏడాది తొలి ఏకదశి, మహాశివరాత్రి సందర్భంగా 21రోజులపాటు వైభవంగా ఉత్సావాలు జరిగేవని ప్రతీతి. ఇప్పటికి గుట్టపై కాత్యాయని దేవి ఆలయం, ఎగువన మల్లిఖార్జున ఆలయాలు కాకతీయుల కాలంలో ఘనమైన పూజలు అందుకున్నట్లు ఏలేశ్వరంలో లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. గణపతి దేవుడితో సహా ఎందరో రాజులు ఇక్కడ సమీపంలోని గ్రామాలకు గ్రామాలనే ఏలేశ్వరస్వామికి పూజల నిమిత్తం భూములులను ధారధత్తం చేసినట్లు తెలుస్తుంది. ఇతిహాసయుగంలోనే ఏలేశ్వరస్వామి వెలసిననట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. కుశాద్వాజుని కుమారై “ఏల” తపస్సు చేసి శివసాక్షత్సరం పొందడం వల్లనే ఈ క్షేత్రం ఏలేశ్వరంగా పేరు గాచిందని శ్రీశైలం స్ధల పురాణంలో ఉంది. ఏలేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో మాధవస్వామి, ఆంజనేయస్వామి, మలమ్మ, మాధవస్వామి ఆలయాలు ఉన్నాయి.కోర్కెలు తీర్చెదైవంగా భక్తుల నమ్మకం, హరిహర మల్లన్న, సంతన మల్లన్న, సాక్షిమల్లన్నగా కొలుస్తారు. ఈ క్షేత్రంలో 101 గుడి, కోటొక్క, శిలా, వేయికవ్వములు ఆడినట్లు పెద్దలు చెబుతారు. సంతానంలేని వారు నదిలో స్నానం చేసి నోటిలో నువ్వులు పెట్టుకుని కొండపై ఉన్న బండపై ఉమ్మితే ఎన్నినువ్వులు పూస్తే అంతమంది పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం శ్రీ ఈశాన్య ద్వారంగా, దక్షిణకాశీగా పేరొందింది. పలనాటి బ్రహ్మనాయుడు యుద్ధం చేసి తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చాడనీ, అప్పుడు మొసలి బారిన పడినప్పుడు తన ప్రాణాల్ని కాపాడమని ఈశ్వరుని వేడుకుంటాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై మొసలి బారి నుంచి కాపాడాడు. ఆ కృతజ్ఞతతో ‘’పలనాటిబ్రహ్మనాయుడు’’ భక్తితో కొండ పైకి ఆలయం వరకు మెట్లు కట్టించాడని చరిత్ర చెబుతోంది.
నాగార్జునసాగర్ నుండి ఏలేశ్వరం కొండకు లాంచీల ఏర్పాటు:చిన్న రామస్వామి,ఆలయ కమిటీ చైర్మన్: నాగార్జునసాగర్ నుండి జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిపే లాంచీలను మహాశివరాత్రిని పురస్కరించుకొని నేడు 8 వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని విజయవిహార్ వద్ద గల లాంచీ స్టేషన్ నుండి ఏలేశ్వరం కొండకు ఏర్పాటు చేస్తున్నామని పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 టికెట్ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. శివరాత్రి రోజు ఉదయం 6గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు లాంచీల రాకపోకలకు ప్రతి రెండు గంటలకొకసారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలేశ్వరం మల్లయ్య గట్టు జాతర మార్చి 8 న నిర్వహిస్తున్నట్లు దేవాలయ పూర్వవైభవ వ్యవస్థాపక ఛైర్మన్ చంద్రవంక చిన్నరామస్వామి తెలిపారు.రెండు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.