– నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మీరు సీఎం పదవికి రాజీనామా చేయండి..
– ఇద్దరం ఎంపీ సీటుకు పోటీ చేద్దాం :సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
– ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత నివేదిక అంటూ విమర్శ
– రేవంత్‌కు పదవులన్నీ పేమెంట్ కోటాలో వచ్చాయంటూ ఘాటు వ్యాఖ్యలు
– పలు అంశాలపై పాత్రికేయులతో ఇష్టాగోష్టి
– మంత్రి ఉత్తమ్‌కు బ్యారేజీకి, రిజర్వాయర్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘అక్కడా, ఇక్కడా కాదు.. మీరు మొన్నటి వరకూ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మీరు కూడా మీ ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి రాజీనామా చేయండి. ఆ సీటు నుంచి ఇద్దరం లోక్‌సభకు పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం…’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటునైనా గెలిచి చూపించాలంటూ సీఎం… బీఆర్‌ఎస్‌నుద్దేశించి ఎద్దేవా చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ రకమైన సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన రిపోర్టును ఆయన ఒక రాజకీయ ప్రేరేపిత నివేదకగా అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ సూచనల మేరకు ఇచ్చిన ఆ రిపోర్టుపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎందుకంత విశ్వాసమంటూ ప్రశ్నించారు. ఉత్తమ్‌కు బ్యారేజీకి, రిజర్వాయర్ కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్…పాలనలో గందర గోళానికి గురవుతున్నారని విమర్శించారు. ఆ కన్ఫ్యూ జన్‌నుంచి బయటపడాలంటూ వారికి సూచించారు.
గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవనలో కేటీఆర్… పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన మేడిగడ్డ పర్యటన, పలు అంశాల్లో విచారణలు చేపడతామంటూ ప్రభుత్వ ప్రకటనలు, పార్లమెంటు ఎన్నికలు తదితరాంశాలపై ఆయన ఈ సందర్భంగా ముచ్చటించారు. సీఎం రేవంత్‌కు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేయాలనీ, మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రూ.2,500 ఇవ్వాలనీ, ఇతర హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా సీఎం మాట్లాడటం శోచనీయమన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించకూడదా..? అని ప్రశ్నించారు. ‘నేనే సీఎం, నేనే సీఎంగా ఉంటా…’ అంటూ రేవంత్ మాట్లాడుతుండటాన్నిబట్టి ఆయనకు ఆత్మనూన్యత భావం (ఇన్‌ఫియారిటీ కాంప్లెక్స్) ఉందని అర్థమవు తోందని వ్యాఖ్యానించారు. ఆయన క్యాబినెట్‌లోని వారిపై ఆయనకే నమ్మకం లేదంటూ ఎద్దేవా చేశారు. తనను, తన పదవులనుద్దేశించి రేవంత్ ‘మేనేజ్ మెంట్’ కోటా అంటూ మాట్లాడటాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ‘నాది మేనేజ్‌మెంట్ కోటా అయితే, మీ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలది ఏ కోటా…?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పీసీపీ అధ్యక్ష పదవితోపాటు సీఎం పదవి కూడా ‘పేమెంట్’ కోటాలోనే వచ్చిందని ఘాటుగా విమర్శించారు. ఆ కోటాలో పదవులు తెచ్చుకున్నందుకు రేవంత్, ఢిల్లీకి పేమెంట్లు చేయాలి, కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలంటూ విమర్శించారు. ఆ డబ్బుల కోసం బిల్డర్లను, వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ తతంగంలో భాగంగానే హైదరాబాద్‌లో భవన నిర్మా ణాలకు అనుమతులివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బిల్డింగులకు అనుమతులిచ్చారు..? ఎన్నింటిని ఆపేశారో తెలపాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ వేధింపులు భరించలేక త్వరలోనే రాష్ట్రంలోని బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కటం ఖాయమని హెచ్చరించారు.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ కుంగిపోవటమనేది రాష్ట్రంలో మొదటి ఘటన కానేకాదని కేటీఆర్ పునరుద్ఘాటిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు వాటికి మరమ్మతలు చేసి కాపాడాయి తప్పితే రేవంత్ ప్రభుత్వం మాదిరిగా వదిలిపెట్టలేదని తెలిపారు. మేడిగడ్డ లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వా లు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిం చారు. పిల్లర్ల రిపేర్లు, ఇంజినీరింగ్ పరిష్కారాల దిశ గా సర్కారు కార్యాచరణ ఉండాలని అన్నారు. అంతే తప్ప ఎన్నికల సమయంలో హడావుడిగా రెండు రోజుల్లో నివేదిక రూపొందించిన ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు మీద ఆధారపడటం సరికాదన్నారు. ఆ సంస్థ ప్రతి నిధులు కనీసం బ్యారేజీ మీద నుంచి కిందికి దిగారా..? కనీసం ఇసుకలోకి దిగి ఒక్క శాంపిల్‌నైనా తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ఉద్దేశపూర్వకంగా ఆదరాబాద రాగా ఎన్‌డీఎస్‌ఏతో నివేదికను తయారు చేయించా రని విమర్శించారు. అందుకే ప్రభుత్వానికి సమర్పిం చాల్సిన నివేదికను మీడియాకు చేరవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టుపై నమ్మకాన్ని ప్రదర్శిస్తున్న మంత్రి ఉత్తమ్‌కు.. ఈడీ, సీబీఐ దాడులపై కూడా అంతే నమ్మకముండాలి కదా..? అని ప్రశ్నించారు. అన్నదాతలను ఆదుకోవాలన్న సెన్సు, కామన్సెన్సు ప్రభుత్వానికి లేవన్నారు. రైతుల కష్టాలను చూసైనా రేవంత్ సర్కార్ తన వైఖరిని మార్చుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని, దాన్ని పరిష్కరించాలని సూచిం చారు. మేడిగడ్డ నుంచి వృధాగా కిందికి పోతున్న నీళ్లను ఎత్తిపోసేందుకు ఒక పంపునైనా పని చేయిం చాలని కోరారు. తమ సూచనలను పనికి రావంటే, నిపుణుల కమిటీ వేసి, దాని సలహాలనైనా పాటిం చాలని విజ్ఞప్తి చేశారు. కాఫర్ డ్యాంను నిర్మించటం ద్వారా నాలుగు నెలల్లో కుంగిన పిల్లర్లకు మరమ్మ తులు చేయాలని కోరారు. కాళేశ్వరంతోపాటు తమ ప్రభుత్వ హయాంలో ఏ విషయంలోనైనా తప్పు జరిగితే కచ్చితంగా విచారణ జరిపించాలనీ, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతే తప్ప బీఆర్‌ఎస్‌పై ఉన్న కక్షతో రైతులను ఇబ్బంది పెట్టొ ద్దని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో తమ పార్టీ నేతల సలహాలు వద్దంటూ చెప్పిన మంత్రికి సునీల్ కనుగోలు సూచనలు మాత్రం బాగా నచ్చుతున్నా యని ఎద్దేవా చేశారు. తమకు న్యాయ స్థానాలపై నమ్మకముందనీ, కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహ రించే ఏ అంశాన్నైనా న్యాయపరంగానే ఎదుర్కొంటా మని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిం చతలపెట్టిన ‘పాలమూరు- రంగారెడ్డి’ యాత్ర కేవలం తమకు పోటీ యాత్ర మాత్రమేనని విమర్శిం చారు. బీజేపీ నేత వెదిరె శ్రీరాం భువనగిరి ఎంపీ సీటు కోసం తాపత్రయ పడుతున్నారని చెప్పారు. అందుకే ఆయన కాళేశ్వరం పై అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని చురకలంటించారు.