విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉందాం

– పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేద్దాం
– సహాయ కార్యక్రమాల్లో పాల్గొందాం ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం : తెలంగాణ ఉద్యోగ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరద సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ అభినందనలు తెలిపింది. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రస్తుత సమయంలో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించాలనీ, పనిగంటలతో సంబంధం లేకుండా నిర్విరామంగా పనిచేయాలని కోరింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, ప్రజలను కాపాడుకోవాలనీ, సంపదను పరిరక్షించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌, టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్ష బీభత్సానికి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల వరకు జనజీవనం స్థంభించిపోయిందని తెలిపారు. ప్రజలు ధన, ప్రాణ, పశు పక్షాదులు, వ్యవసాయ పంటలు, సంపదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు, అధికారు లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వరద సహాయ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొనాలని కోరారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలకు ప్రాణనష్టం రాకుండా సహాయం చేయడానికి పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు, అధికారులు ఉన్నారంటూ మరింత నిబద్ధతతో పనిచేసి ప్రజల్లో భరోసా కల్పించాలని తెలిపారు.