– రైతుభరోసా ఇవ్వనివాళ్లని ఏ చెప్పుతో కొట్టాలో ప్రజలే తేల్చుకోవాలి
– కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తాం.. కొట్లాడుతాం
– కరీంనగర్ ఎంపీ ఒక్క గుడి, బడి అయినా కట్టిండా..?
– నూరు అబద్ధాలతో మోడీ ప్రధాని.. రేవంత్ సీఎం అయ్యారు
– కాంగ్రెస్‌పైనా, బీజేపీ ఎంపీపైనా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను వదిలేది లేదు.. హామీలను అమలు చేయకపోతే నడిరోడ్డుపై బట్టలిప్పి నిలబెడుతాం. రైతుబంధు అడిగిన రైతులనే చెప్పుతో కొడతామని బెదిరిస్తున్న వాళ్లను.. రైతుభరోసా ఇవ్వకపోతే ఏ చెప్పుతో కొడతారో.. లేక ఓటుతో కొడతారో ప్రజలే తేల్చుకోవాలి. ఎప్పుడూ హిందువుల గురించి మాట్లాడే కరీంనగర్ ఎంపీ సంజరు ఒక్క గుడి, బడి అయినా కట్టిండా..? కనీసం ఐదు కొత్తలు కూడా తేలేదు’ అంటూ కాంగ్రెస్‌పైనా, కరీంనగర్ ఎంపీ సంజరుపైనా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌తో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని కాంగ్రెస్ చూస్తోందని తెలిపారు. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో నూరు అబద్ధాలు చెప్పి మోడీ ప్రధాని అయ్యారని, ఇక్కడ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. ‘మనం అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు.. మనం చేసిన అభివృద్ధి, వాళ్లు ఇచ్చిన హామీలు..అమలుపై మాట్లాడండి’ అని నాయకులకు దిశానిర్దేశనం చేశారు. 1.8శాతం ప్రజలు మాత్రమే మనపై చూపిన అలకతో అధికారం కోల్పోయామని, అందులోనూ 14 సీట్లలో స్వల్ప ఓట్ల తేడాతోనే చేజార్చుకున్నామని తెలిపారు. 2004లో ఇదే కరీంనగర్ ప్రజలు 2లక్షల మెజార్టీతో కేసీఆర్‌ను గెలిపించారని, ఆయన చేపట్టిన ప్రతి ఉద్యమానికీ ఊపిరిలూది ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లోపు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలు, వారి డొల్లమాటలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత తమ వారియర్స్‌పైనే ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హామీల్లో మహిళలకు రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్క మహిళకూ రూ.2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా 18ఏండ్లు నిండిన కోటీ 56లక్షల మంది మహిళలకు అమలు చేయాల్సిందేనని, ఇవ్వకపోతే వారి తరుపున బీఆర్‌ఎస్ కొట్లాడేందుకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీలో తాను, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మాట్లాడితే నీళ్లు నమిలారని, ముగ్గురు బీఆర్‌ఎస్ సైనికుల ప్రశ్నలకే తడబడితే ఇక తమ కమాండర్ కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడితే కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ సహా పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మెన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.