ఆరోగ్యవంతమైన దేశానికి ఆరోగ్యకరమైన పిల్లలు అవసరం. మన దేశంలో పిల్లల మరణాలకు అతిసార వ్యాధి ప్రధాన కారణంగా ఉంది. కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగడం వలన ఈ వ్యాధి సంభవిస్తుంది. మన దేశంలో శిశు మరణాలు ఒక ముఖ్యమైన సమస్యగా తయారైనప్పటికీ పిల్లల మరణాల రేటును తగ్గించడంలో కొంత పురోగతి సాధించడం చెప్పుకోదగ్గ విషయం. పిల్లల మరణాలకు కారణాలు అనేకం. ఇవి ప్రాంతం సామాజిక ఆర్థికస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. అతిసారానికి బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు ప్రధాన కారకాలు. ఐదేండ్లకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అత్యంత సాధారణ వైరల్ వ్యాధికారకాలలో రోటవైరస్, నోరోవైరస్, అడెనోవైరస్, ఆస్ట్రోవైరస్లు బాక్టీరియల్ వ్యాధికారక కారకాలలో ఎస్చెరిచియా కోలి, సాల్మోనెల్లా, షిగెల్లా, కాంపిలోబాక్టర్లు పరాన్నజీవి వ్యాధికారకాలలో క్రిప్టోస్పోరిడియం, గియార్డియా, ఎంటమీబా ఉన్నాయి. రోటవైరస్, ఈ.కోలి అన్ని వయసుల పిల్లలలో అత్యంత సాధారణ వ్యాధి కారకాలు. పరాన్నజీవి వ్యాధి కారకాలు మూడు నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలలో ప్రబలంగా ఉంటాయి. ఇ.కోలి, సాల్మోనెల్లా, షిగెల్లాతో సహా బాక్టీరియల్ వ్యాధి కారకాలు, రోటవైరస్, నోరోవైరస్, సాపోవైరస్ వంటివి ఆరు నుండి పదేండ్ల వయస్సు పిల్లలలో సాధారణం. చిన్నపిల్లల విరేచనాలు నివారించదగినవి, నయం చేయగలవి. అయినప్పటికీ ఈ ముప్పు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతిసారం వల్ల కలిగే అత్యంత తీవ్రమైన ముప్పు నిర్జలీకరణం. విరేచనాల సమయంలో నీరు, ఎలక్ట్రోలైట్లు (సోడియం, క్లోరైడ్, పొటాషియం, బైకార్బోనేట్) వంటివి విరోచనాలు, వాంతులు, చెమట, మూత్రం, శ్వాస ద్వారా బయటకు పోతాయి. ఈ నష్టాలను భర్తీ చేయనప్పుడు నిర్జలీకరణం సంభవిస్తుంది.
స్టాప్ డయేరియా కార్యక్రమం
అతిసారం అనేది పిల్లలు ఎదుర్కొనే సాధారణ వ్యాధి. మిషన్ ఇంద్రధనుష్, రోటావైరస్ వ్యాక్సిన్, స్టాప్ డయేరియా ప్రచారానికి మధ్య సంబంధం ఉంది. 2014 సం.లో రోటావైరస్ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశం భారతదేశం. జాతీయ జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నెట్‌వర్క్ విస్తరణ దేశంలో డయేరియా కేసులతోపాటు మరణాల తగ్గింపుకు గణనీయంగా దోహదపడ్డాయి. ఇంతకుముందు ప్రభుత్వం డయేరియాను తగ్గించడానికి పక్షం రోజులకోసారి ప్రచారం నిర్వహించేది. అది ఇప్పుడు చాలా విస్తృతమైన సమగ్రమైన ప్రచారానికి పునరుజ్జీవింపచేయబడింది. దేశంలో డయేరియా నిర్వహణ వ్యూహాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రచారం దోహదపడుతుంది. పిల్లలలో నానాటికీ పెరుగుతున్న డయేరియా సమస్యను పరిష్కరించడానికి శిశు మరణాలను సున్నాకి తీసుకురావడానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తన దీర్ఘకాల ఇంటెన్సివ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్ ని స్టాప్ డయేరియా క్యాంపెయిన్‌గా రీబ్రాండ్ చేసింది. 2014 లో ప్రారంభించబడిన ఈ చొరవ నివారణ , రక్షణ మరియు చికిత్స వ్యూహాన్ని పెంచడం, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ఒ ఆర్ యస్), జింక్ వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెడుతుంది. ప్రచారం 2024 యొక్క నినాదం ” నివారణ , పారిశుధ్యం, ఓఆర్‌ఎస్‌తో అతిసారాన్ని జాగ్రత్తగా చూసుకోండి”, ఇది నివారణ , పారిశుద్ధ్యం సరైన చికిత్స ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
స్టాప్ డయేరియా ప్రచారం రెండు దశల్లో అమలు చేయబడుతుంది. 14 జూన్ నుండి 30 జూన్ 2024 వరకు ప్రారంభ దశ మరియు 1 జూలై నుండి 31ఆగస్టు 2024 వరకు ప్రచార దశ. ఈ కాలంలోని ప్రధాన కార్యకలాపాలలో డయేరియా సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ఇళ్లకు ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్‌ఎస్, జింక్ కోప్యాకేజీల పంపిణీ, ఆరోగ్య సౌకర్యాలు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్, జింక్ కార్నర్‌ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో అవగాహనా ప్రయత్నాలను తీవ్రతరం చేయడం కూడా ఉంది. అదనంగా సమగ్ర సంరక్షణ నివారణను నిర్ధారించడానికి డయేరియా కేసు నిర్వహణ కోసం ప్రచారం సదుపాయాన్ని బలోపేతం చేస్తుంది.
స్టాప్ డయేరియా దృష్టిదాల్చే ప్రాంతాలు
ఆరోగ్య సౌకర్యాల సరైన నిర్వహణ, వినియోగాన్ని నిర్ధారించడం, అవసరమైన వైద్య సామాగ్రి లభ్యతను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడం లాంటి ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్యాన్ని అందించడానికి కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు స్థిరమైన పద్ధతులను అమలు చేయడం, పారిశుధ్య ప్రాప్యతను మెరుగుపరచడం మెరుగైన పోషకాహార కార్యక్రమాల ద్వారా అతిసార వ్యాధులకు ప్రధాన కారణమైన పోషకాహార లోపాన్ని పరిష్కరించడం వంటి కార్యక్రమాలను పెంచడం ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం లాంటి అంశాలపై స్టాప్ డయేరియా ప్రచారం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఫోకస్ ప్రాంతాలు డయేరియా నిర్వహణ నివారణకు సమగ్ర విధానాన్ని రూపొందించడం, చివరికి పిల్లల మరణాలను తగ్గించడం, మొత్తం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, తాగునీరు పారిశుధ్య శాఖ, స్త్రీ శిశు అభివఅద్ధి శాఖ , పాఠశాల విద్య గ్రామీణాభివృద్ధి పట్టణాభివఅద్ధి శాఖ వంటి వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తోంది. ఈ బహుళ రంగాల విధానం పిల్లల మరణాలను తగ్గించడానికి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి సమగ్రమైన ప్రభావవంతమైన కార్యక్రమాన్ని అందించడానికి ఉద్దేశించిన స్టాప్ డయేరియా ప్రచారానికి మెరుగైన సమన్వయం అమలును నిర్ధారిస్తుంది.
డయేరియాకు కారణాలు
విరేచనాలతో మరణించే పిల్లలు తరచుగా పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. దీనివలన వారు డయేరియా బారిన పడే అవకాశం ఉంది. ఐదేండ్లకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం. అతిసార వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల తీవ్రతరం అవుతుంది. ఆహారాన్ని అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేసినప్పుడు లేదా నిల్వ చేసినప్పుడు అతిసారం రావడానికి మరొక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అసురక్షిత గృహానీటి నిల్వ నిర్వహణ కూడా ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. కలుషిత నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం కూడా వ్యాధికి దోహదపడతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత సరిగా లేకపోవడం, స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం దేశంలో అతిసారం అధిక సంభావ్యతకు కారణాలు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నివారణ చర్యలు ఏం తీసుకోవాలి? సురక్షితమైన నీరు తాగాలి. భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. శిశువుకు మొదటి 6 నెలలు తల్లిపాలు తాగించాలి.
(1జూలై-31ఆగస్టు 2024 వరకు
ప్రచార దశ సందర్భంగా)
జనక మోహనరావు దుంగ
8247045230