ఐలమ్మ స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ను ఇంటికి సాగనంపుదాం

– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
ఐలమ్మ స్పూర్తితో బీఆర్‌ఎస్‌ను ఇంటికి సాగనంపుదామని, బీఆర్‌ఎస్‌ పాలనలో బడుగుబలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి పనులు చేపట్టలేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. వీరనారిమని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా షాద్‌నగర్‌ పట్టణంలో ఆమె విగ్రహానికి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ పెత్తందారుల పీడను విరగడ చేసి ఎంతో ధైర్యశాలిగా నిలిచిన ఐలమ్మ ఆశయాల సాధనలో నేటి పాలకులను కూడా ఎదిరించి తరిమికొడతామని అన్నారు. ప్రభుత్వ పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలను దోచుకు తింటున్నారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రఘు, చెన్నయ్య, ఆగిరి రవికుమార్‌ గుప్తా, దర్శన్‌, ఆలీం, ముబారక్‌, అందె మోహన్‌, నల్లమోని శ్రీధర్‌, మల్లేష్‌, శ్రీధర్‌, గంగమొని సత్తయ్య, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.