
నవతెలంగాణ – భువనగిరి: మత రాజకీయాలకు అవినీతికి వ్యతిరేకంగా రానున్న ఎన్నికలలో బీజేపీని ఓడించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక వర్తక సంఘంలో సీపీఐ(ఎం) పట్టణ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో ఇండియా కూటమితో కుదిరిన అవగాహన మేరకు ముందుకు పోతామన్నారు. రాష్ట్రంలో రాజకీయ అవగాహన తుది చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అవగాహన మేరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో సమావేశాలు జరుగుతాయన్నారు. భువనగిరి బీఆర్ఎస్ శాసనసభ్యులు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. కనీసం జిల్లా కేంద్రంలో టౌన్ హాల్ లేకపోవడం బాధాకరమన్నారు. సొంత ప్రయోజనాల కోసం అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అడ్డగూడూరు ప్రాంతంలో వేలకోట్ల విలువైన మైనింగ్ ఇసుకను అక్రమంగా తరలించారని వీటిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయిందన్నారు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ఆదుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ పట్టణంలో 2000 మందికి ఇంటి నివేశిత స్థలాలు పట్టాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి రుణం ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే లబ్ధిదారులను గుర్తించిన కొందరికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ కేటాయించిందన్నారు. వాటిని ప్రజలకు అందజేయడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైనడని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన భువనగిరి ప్రాధాన్యతను గూర్చి 100 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. క్రీడాకారులకు అవుట్డోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలన్నారు. నూతన రైతు మార్కెట్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు అండగా నిలవాలన్నారు. ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడంతో పాటు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు డాక్టర్లను సిబ్బందిని నియమించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబితా, సీపీఐ(ఎం) భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, మండల కార్యవర్గ సభ్యులు ఉడత రాఘవులు, సోమన ఐలయ్య, చింతల పెంటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షర్ఫుద్దీన్, చిక్క బిక్షపతి, దాసరి మారయ్య, తలారి చంద్రమౌళి పాల్గొన్నారు.