ఈ లోకంలో కొద్దిమంది మాత్రమే రాజ్యాలు ఏలడానికి పుడ్తారు. చాలామంది వారి ముందు చేతులు కట్టుకు నిలబడ్డానికి పుడ్తారు అన్నది పుండరీకం నిశ్చిత అభిప్రాయం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత అనే మాటలు శుద్ధ తప్పని, ధనికుల కొరకు, ధనికుల చేత అనే మాటలే కరెక్టు అనేది కూడా పుండరీకం కచ్చితమైన అభిప్రాయం. ఇంచేత ఎన్నికలంటే పడదు. ఓటు అన్న మాట అసలు గిట్టదు. ఎలాగో ఈ పార్టీ వాడో, ఆ పార్టీవాడో ఎన్నికవుతాడు. ఏలికవుతాడు. మనం ఓటు వేస్తే ఎవడో ఒకడు కాడా? అని ప్రశ్నిస్తాడు. తనకు ఓటు హక్కు వచ్చాక ఐదో ఆరో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కానీ ఒక్కసారీ ఓటు వేసిన పుణ్యాన్ని దక్కించుకోలేదు. ఎలెక్షన్ డే లన్నీ జాలీగా, హుషారుగా, ‘హాలిడేలు’గా ఎంజారు చేసేవాడు. ఎన్నికలనగా దండుగ ఖర్చని, ప్రచార సందర్భంలో ట్రాఫిక్ జామ్‌లని, మైకులో గోల అనీ ఎన్నికల పేరు చెబితే చాలు కోడెనాగులా లేచి బుసగొడ్తాడు. వీడితో ఓటు వేయించడం, ప్రజాస్వామ్యం మీద వీడికి నమ్మకం కలిగించడం మన తరం కాదని ఈ తరం మిత్రులందరూ ఆశ వదిలేశారు. పుండరీకం ఓటు శాశ్వతంగా మురిగిపోయినట్టేగా అని భావించారు. అయినా కొందరు ఆశావహులు లేకపోలేదు. పుండరీకం చేత ఓటు వేయించాలనుకునే మొండోళ్లు లేకపోలేదు.
ఒకసారి ఎన్నికల తేదీ మర్నాడనగా, పుండరీకానికి పుట్టెడు జ్వరం వచ్చింది. తెల్లవారితే హాలిడే హాయిగా ‘చిల్లవకుండా’ ఈ మాయదారి జ్వరం తగులుకుంది అనే దిగులు ఓ పక్క సతాయించినా, ఈ పరిస్థితుల్లో తనను ఓటు వెయ్యడానికి రావా అని ఎవడూ అడగడని సంతోషపడ్డాడు కూడా. ఊరికే వచ్చేస్తారు ప్రజాస్వామ్యం, పౌరుల బాధ్యతలు అని ప్రవచనాలు ప్రేలడానికి అనుకున్నాడు. ఇదేం జ్వరం? ఆర్డినరీ జ్వరమా, ఎక్స్‌ట్రార్డనరీ జ్వరమా లేక ఎమర్జెన్సీ జ్వరమా అని అనుమాన పడసాగాడు. ఒళ్లు సెగలూ పొగలూ కక్కుతుంటే, చిటపటమంటుంటే.
ఎవర్రా మీరు? బలవంతంగా ఈడ్చుకుపోతున్నారు? అని గావుకేకలు పెట్టసాగాడు పుండరీకం.
‘నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఎవరికీ వినిపించనంత సుదూరంలో వున్నాం జీవుడా!’ అన్నాడొకడు పుండరీకం కుడి రెక్క పట్టుకున్నవాడు.
‘ఏరు! నా పేరు జీవుడు కాదు, పుండరీకం!’ అన్నాడు పుండరీకం.
‘చచ్చాక ఏ పేరు పెట్టుకున్నవాడినైనా మేం జీవుడనే అంటాం రా జీవా!’ అన్నాడింకొకడు పుండరీకం ఎడమ రెక్క పట్టుకు లాక్కుపోతున్నవాడు.
‘చచ్చాక ఏంటి? చచ్చడమేమిటి? అసలు చచ్చిందెవరు?’ అన్నాడు అయోమయం జగన్నాథంలా పుండరీకం.
‘నువ్వేరా చచ్చినోడా! విష జ్వరం వచ్చి గుండె బరువై వేడై, బీడై పోయింది మరి’ అన్నాడు కుడిపక్కవాడు.
‘గుండె ఆగిపోయాక భూమ్మీద ఏం చేద్దామనిరా! అందుకే లాక్కువచ్చాం. మా డ్యూటీ మేం చేశాం’ అన్నాడు ఎడంపక్కవాడు.
ఎదురుగ్గా ఓ పెద్ద ద్వారం, దానిపైన ‘నరకద్వారం’ అన్న బోర్డు కనిపించాక తను చావలేదన్న ఆశ పుండరీకంలో చచ్చుబడిపోయింది.
‘చస్తే చచ్చాను కానీ, నేనేం డాఫర్నీ, లోఫర్నీ, కేడీనీ, రౌడీని కాను. గల్లీ లీడర్ని అంతకంటే కాను. పోలీసు ఎక్సయిజు, సేల్స్ టాక్స్, రెవెన్యూ ఉద్యోగిని కూడా కాను. అందువల్ల ‘క్లీన్ చిట్’ వున్న మనిషిని నేను. నన్ను స్వర్గద్వారం దగ్గరికి తీసుకుపొండి’ అన్నాడు పుండరీకం వైనూ, వుమనూ అక్కడ అంతా లాహిరి లాహిరిలో అనుకుంటూ.
భూమ్మీద ఓయమ్మ… నేను ఏ నేరమూ చేయలేదు. నన్ను అనవసరంగా, రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారు. అయినా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అంటూ రెండు వేళ్లూ చేతులూపుతున్నది.
‘నరకం గేటులోకి వచ్చే ప్రతి నిత్యానందుడూ, ప్రజ్వలుడూ ఇవే మాటలు చెప్తాడు’ నోరు మూసుకో అని కోప్పడ్డారిద్దరు జవాన్లు.
ఒక చోట ఓ లావుపాటి మనిషిని రంపంతో పరపరమని కోస్తున్నారు. అదిరిపడ్డాడు పుండరీకం.
‘ఎ..ఎ.. ఎవరీన.. ఎందుకా రంపపు కోత’ అన్నాడు నత్తినత్తిగా.
‘వాడా! పాపపుణ్యాల మాట యముడెరుగు. జీవితంలో ఒక్కసారి కూడా ఎన్నికల బూత్ ముఖం చూడలేదు. కనీసం ఒక్కసారన్నా వేలు మీద ఇండెలిబుల్ ఇంకు చుక్క పెట్టించుకోలేదు. అందుకే అడ్డంగా కోసి ముక్కలు ముక్కలు చేస్తున్నారు’ అన్నాడో జవాన్.
‘తూచ్.. అన్యాయం… ఇదేం న్యాయం. ఓటు వెయ్యనంత మాత్రాన అడ్డంగా నరుకుతారా? అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఓ ఫార్సు. అనగా కట్టుకథ. వట్టి వేస్టు’ అన్నాడు పాత వాసన పట్టి వదలని పుండరీకం.
‘షట్ యువర్ మౌత్! ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పకు. వెనుకటికి దేవాంతకుడు అనేవాడొకడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజకీయ పాఠశాల నడిపాడు. మాకు బాగా అర్ధం అయి ప్రతి పదేళ్లకూ కొత్త యముడ్ని ఎన్నుకుంటున్నాం. ఓటు పవరు ఏమిటో అర్ధం చేసుకున్నాం. బాధ్యత లేకుండా వాగితే బండకేసి బాదుతా’ అన్నాడొక భటుడు.
ఒకచోట సన్నగా దండెం కర్రలా వున్నవాణ్ని, పెద్ద బాండ్లీలోని నూనెలో మిరపకాయ బజ్జీలా వేపుతున్నారు. అదిరిపడ్డాడు పుండరీకం. ‘ఎ..ఎ.. ఎవరీన. ఎందుకా మాపాయిల్ వేపుడు దుర్వాసన వస్తోంది’ అన్నాడు పుండరీకం.
‘మాపాయిల్‌లో కాకపోతే మావిడికాయ పచ్చళ్లకు వాడే ఎ.ఎస్.బ్రాండు పప్పునూనె వాడతామా? వీడూ ఇందాకటి వాడిలాగానే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఓటు వేసి పుణ్యం సంపాదించలేదు. అందుకే ఈ మిర్చిబజ్జీ వేపుడు. అసలు నరకంలో ఈ డిపార్ట్‌మెంట్ అంతా ప్రజాస్వామ్యాన్ని ఎద్దేవా చేసినోళ్లకు, ఓటు వెయ్యకుండా ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేసినోళ్లకు సంబంధించినదే. ఓటు వెయ్యకుండా చచ్చుపుచ్చు కబుర్లు చెప్పి చచ్చేవాళ్లనిక్కడ పరపరా కోస్తాం, సలసలా వేపుతాం, ముళ్ల గదలతో బాదుతాం, తేళ్లు, కక్రోచ్‌ల డెన్నుల్లో పడేస్తాం’ అన్నాడింకో భటుడు.
‘ఇక నా పని గోవిందా గోవింద’ అని గజగజ వణుకుతున్న పుండరీకాన్ని యముడి ముందు బోనులో నిలబెట్టారు భటులు.
‘ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం, ఓట్ల రోజును హాలిడేగా ఎంజారు చెయ్యటం ఇతని నేరాలు, ఘోరాలు’ అన్నాడు చిత్రగుప్తుడు ‘యంప్యూటర్’లో చూసి.
‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పుట్టడం నీ అదృష్టం. నీలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకులే అని ఓటు వెయ్యకపోతే డబ్బుకు ఓటు అమ్ముకునే వాళ్లు, క్వార్టర్ మందు కోసం ఓటు వేసే వాళ్లు వేసే ఓట్లతో గెలిచే నాయకులు ఎలా వుంటారు? మేధావులు, బాగా చదువుకున్నవారూ కదిలివస్తే, ఓటు వేస్తే మంచివారిని ఎన్నుకునే అవకాశం వుంటుంది. అప్పుడు ప్రపంచంలో ప్రజాస్వామ్యమే గొప్పదని అందరికీ తెలియవస్తుంది. నువ్వు ఇంతవరకూ ఒక్కసారన్నా ఓటు వెయ్యలేదు. కనుక నీకు…’ అని యమధర్మరాజు అంటుంటే ఎందుకో తన చూపుడు వేలుకేసి చూశాడు పుండరీకం. వేలు చివర గోరు మీద పౌరుడు తన బాధ్యతను నెరవేర్చాడని తెలిపే ‘ఇంకుచుక్క’ వుంది.
‘లేదు లేదు. నేను వేశా, ఓటు వేశా! కావాలంటే ఇదిగో చుక్క ఇదే. ఇదే చుక్క’ అంటూ బోను పైకెగిరి దూకాడు యమరాజుకు వేలు చూపించడానికి పుండరీకం.
దబ్బున మంచం మీది నుంచి దొర్లి కిందపడ్డాడు పుండరీకం. పగటి కల పుండరీకం కళ్లు తెరిపించినట్టుంది. ఫ్రెండ్సందరికీ ఫోన్లు చెయ్యసాగాడు. రేపు తను ఓటు వెయ్యడమే కాక, తన ఫ్రెండ్సందరినీ ఓటు వెయ్యడానికి వచ్చి తీరాలని పదే పదే చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
– చింతపట్ల సుదర్శన్
9299809212