– మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరు..
‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గులాబీ ఎమ్మెల్యేలు సిద్ధం . బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం. మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు . ఏటా 2కోట్ల ఉద్యోగాలన్న మోడీ.. ఎన్నిచ్చాడు.. .రైతులను బలిగొన్నాడు . ఇందిరమ్మ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు . రాష్ట్రవ్యాప్తంగా 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం.’ – ప్రజా దీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– భద్రాచలం, మణుగూరులో ఇందిరమ్మ ఇండ్ల పథకం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి :
మోడీని కడుగుతాం.. కేడీని (కేసీఆర్) ఉతుకుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు పన్నుతున్నాయని, తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గులాబీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, మణుగూరులో సోమవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం, ప్రజా దీవెన సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలేనన్నారు. ఖమ్మం జిల్లాలో 9 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఖమ్మం నుంచి ప్రారంభించామన్నారు. రూ.22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారు కాబట్టే ప్రజలు బీఆర్‌ఎస్‌ను 100 మీటర్ల లోతుకు తొక్కారని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బలరాం నాయక్‌ను లక్షన్నర మెజార్టీతో గెలవనున్నారని జోస్యం చెప్పారు.
పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగుద్దా..?
తాము మంచి చేస్తుంటే చూడబుద్ది కాక తండ్రీకొడుకులు, బిడ్డ, అల్లుడు శాపాలు పెడుతున్నారన్నారు. ‘ఉట్టిమీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగుద్దా?’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. మోడీ, కేడీ కలిసినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలయ్యాక ఈ ప్రభుత్వం ఉండదని బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ రోజుకోసారి అంటున్నారని, ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలతో ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన 9 సీట్లలో బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించలేదని, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నాలుగు సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని ఆరోపించారు. కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరనే భయంతో, చీకట్లో ఒప్పందం చేసుకొని అలారు బలారు చేసుకొని మోడీ, కేడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు.
తాను గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్.. బిల్లా రంగా సమితి..
ఇందిరమ్మ ఇండ్లు వద్దు.. అవి డబ్బా ఇండ్లు అంటూ కేసీఆర్ భాష, యాసలతో మోసగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడు తూర్పున ఉదయించి.. ప్రపంచానికి ఎలా వెలుగు ఇస్తాడో.. అలానే తెలంగాణకు ఖమ్మం జిల్లా భద్రాచలం, మణుగూరు తూర్పునే ఉంటుందని, అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి ఆశీర్వాదంతో ప్రారంభించామన్నారు. 90 రోజుల్లోనే తాము హామీలన్నీ అమలు చేస్తున్నామని, బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు పదేండ్లలో అమలయ్యాయా అని కేటీఆర్ ఆయన తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని, హరీశ్‌రావు, కేటీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన తోడు దొంగలని మండిపడ్డారు. కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ అని, ఆయన పాపాలతో కాళేశ్వరం కూలిపోయి, మేడగడ్డ మేడిపండై, అన్నారం పగిలిపోయి సుందిళ్ల దెబ్బతిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రారంభిస్తే సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాగడానికి నీళ్లు లేకుండా చేసిందన్నారు. ఈ దేశంలో మాట తప్పని, మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 92 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చిన మోడీ.. ఈ పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. అలా చేసి ఉంటే తెలంగాణలో 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, నిరుద్యోగ సమస్య ఉండేది కాదని అన్నారు. కేసీఆర్, మోడీ ఒక్కటై ప్రజలపై భారాలు మోపారన్నారు. రూ.500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200 చేశారని, రూ.55 ఉన్న పెట్రోల్‌ను రూ.110 చేశారని వివరించారు. నాడు వైఎస్‌ఆర్ ఇందిరమ్మ ఇండ్ల్లు ఇచ్చిన చోట తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చిన చోట కేసీఆర్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇండ్లున్న చోట మోడీ ఓట్లు అడగగలరా అని ప్రశ్నించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు బొమ్మకే పరిమితం : మంత్రి పొంగులేటి
గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ఎన్ని ఇండ్లు ఇచ్చారని, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు బొమ్మకే పరిమితమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన గత ప్రభుత్వం భద్రాద్రి రాముడికి రూ.100కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదో గ్యారంటీగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. దళిత, గిరిజనులకు రూ.6లక్షల చొప్పున, మిగిలిన వారికి రూ.5లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2.90లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల టెండర్లు పిలిచి 1.49 లక్షలు మాత్రమే నిర్మించి.. కేవలం 90వేలు మాత్రమే లబ్దిదారులకు పంపిణీ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం లాగా పింక్ కండువాలకే కాకుండా.. గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ ఇండ్ల పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఈ సభల్లో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మట్టా రాగమయి, రాంచందర్ నాయక్, తెల్లం వెంకట్రావ్, కూనంనేని సాంబశివరావు, రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షులు పోదెం వీరయ్య, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజరుబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.