– లీకులొద్దు..వ్యతిరేకంగా మాట్లాడొద్దు
– విభేదాలతో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాం..సిట్టింగ్ ఎంపీలకే సీట్లు : బీజేపీ ముఖ్యనేతల అంతర్గత సమావేశంలో అమిత్‌షా దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ ముఖ్య నేతల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌పై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్ హోటల్లో బీజేపీ అగ్రనేతలతో అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల సోషల్‌మీడియాలో నేతల మధ్య జరిగిన పోస్టుల వార్‌పై ఆరా తీసి మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈటల, బండి, మరికొందరు సీనియర్లకు ఈ సందర్భంగా ఆయన క్లాస్ పీకినట్టు తెలిసింది. నేతల మధ్య విభేదాల వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామనీ, దీనివల్ల 14 శాతం ఓట్లు, ఎనిమిది సీట్లకే పరిమితమయ్యామని మందలించారని ప్రచారం జరుగుతున్నది. ఇకపై నేతలెవ్వరూ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ విషయాలు లీకులివ్వొద్దని ఆదేశాలిచ్చారు. క్రమశిక్షణ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి సూచించారు. సోషల్‌మీడియా వేదికగా నేతలు, వారి అనుచరులు ఒకరికొకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఇక నుంచి అలాంటి జరగకుండా చూసుకోవాలనీ, లేదంటే నేతలే బాధ్యత వహించాలని చురకలు అంటించారు. నేతలంతా ఐక్యంగా కష్టపడి పనిచేస్తే 15 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పినట్టు తెలిసింది. అందుకే ఇగోలు, భేదాభిప్రాయాలు పక్కనబెట్టి తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడంపై దృష్టి సారించాలని అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీచేసేందుకు ఆయన గ్రీన్‌సిగల్ ఇచ్చారని నేతలు చెప్పారు. 4 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా లోక్‌సభ స్థానాలపై నియోజకవర్గాల వారీగా ఆరా తీసినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరిగా కాకుండా పార్లమెంటరీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలనే నేతల సూచనను ఆయన సానుకూలంగా తీసుకున్నారు. సిట్టింగ్‌లు పోనూ మిగతా స్థానాల్లో సర్వే చేసి గెలుపుగుర్రాలకే సీట్లు ఇస్తామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ సమావేశంలో బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక అంశం కూడా చర్చకు రాగా.. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ ఎల్పీను బీసీ ఎమ్మెల్యేను చేయాలని ఆయన సూచించినట్టు వినికిడి. అలాగైతే ప్రధానంగా పాయల్ శంకర్, రాజాసింగ్ రేసులో ఉండనున్నారు. సామాజిక, ఆర్థిక కోణం, భవిష్యత్‌లో పార్టీ ఎదుగుదల కోసం బలమైన సామాజిక తరగతికి చెందిన వ్యక్తి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. దీంతో బీజేపీఎల్పీ నేత పేర్ల రేసులో మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి కూడా వచ్చి చేరినట్టయింది.