– నూతన పీఏసీఎస్ భవన ప్రారంభించిన కేంద్ర మంత్రి,ఎమ్మెల్యే
– పీఏసీఎస్ బలోపేతానికి తోడ్పడాలని విజ్ఞప్తి
– మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు అందించాలని ప్రభుత్వానికి సూచన
నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధికి..ప్రజా సంక్షేమానికి పార్టీలకతీతంగా జెండాలను, ఎజెండాలను, బేషజాలను పక్కనపెట్టి పని చేద్దామని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అయా పార్టీల ప్రజాప్రతినిధులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో రూ.3 కోట్ల నాబార్డు నిధులతో పూర్తయిన పీఏసీఎస్ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బాను ప్రసాద్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏసీ పంక్షన్ హాల్ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రూ.6 వేలు కిసాన్ సమ్మాన్ నిధులు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయంగా జమ చేస్తోందని.. యూరియా కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఎరువులపై సుమారు రూ.30 వేల కోట్ల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోదీదేనన్నారు.యూరియా బస్తా మీద రూ. 2,236 లు సబ్సిడీ అందజేస్తుందన్నారు.రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎరువుల కొరతలేకుండా.. చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసే పనిలేకుండా చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. యూరియా బస్తాలు మోసే పనిలేకుండా నానో యూరియా ప్యాకేట్లను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులు గ్రామాల అబివృద్ధికి శాయశక్తుల కృషి చేశారని..అభివృద్ధి పనుల బిల్లులను ప్రభుత్వం వెంటనే అందించాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి, ఎమ్మెల్సీ బాను ప్రసాద్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవిశెట్టీ శ్రీనివాస రావును పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు, డైరెక్టర్లు శాలువ కప్పి శన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పీఏసీఎస్, డీసీసీబీ సిబ్బంది, అయా గ్రామాల రైతులు, నాయకులు హాజరయ్యారు.