స్థాయి హోదాతో రాదు, తీసుకున్న నిర్ణయాలతో వస్తుంది

With rank comes decisions madeమూర్ఖుడి దృష్టి ధర్మం మీద ఉంటుంది తెలివిగలవాడి దృష్టి జ్ఞానం మీద ఉంటుంది.
మృత్యు వ్యాపారి, డైనమైట్‌ కింగ్‌ మరణించాడు అనే వార్త-దాని కింద తన ఫొటో చూసి ఒక వ్యక్తి ఖంగు తిన్నాడు. ఆ ఫొటో తనదే. కింద పేరు కూడా తనదే-ఆల్‌ ఫ్రెడ్‌ నొబెల్‌.
ఆ రోజు ఆ పత్రిక ఆఫీసులో ఏదో పొర పాటు జరిగి ఉంటుంది. ‘శ్రద్ధాంజలి’-శీర్షిక కింద ఎవరి గురించో రాయబోయి తన గురించి రాశారు. విషయం పూర్తిగా తెలుసుకో కుండా, తొందరపడి వేశారు. సరే, మరునాడు సవరణ ప్రచురిస్తారు. అది మామూలే. అయితే విషయం అదికాదు. జనం దృష్టిలో తను హంతకుడిగా, మారణహోమాలు జరిపించే వాడిగా ఉన్నానన్న మాట! ‘తనను ‘మృత్యు వ్యాపారి’ అని అన్నారంటే, అందుకు కారణం తను డైనమైట్‌ను కనుక్కోవడమే కదా? ఇక నుంచి తను ప్రపంచ శాంతి కోసం తప్పక కృషి చేయా ల్సిందే- అని అనుకుని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆయనే శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నొబెల్‌! తన ఆస్థినంతా ఒక ట్రస్ట్‌కు రాసిచ్చాడు. మానవత్వాన్ని నిలపడానికి, మహో న్నతమైన సేవలు అందించే ప్రపంచ పౌరులకు తన పేరుతో ప్రతియేటా ‘నొబెల్‌ పురస్కారాలు’ అందించాలని ఆ ట్రస్ట్‌ను ఆదేశించాడు. అప్పటి నుండి శాంతి స్థాపనకు సంబంధించి. వైద్య – విజ్ఞాన రంగాలలో నొబెల్‌ పురస్కా రాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మానవాళి అభ్యున్నతి కోసం. సమాజ పురోగతి కోసం ఇలాంటి నిర్ణయాలు ఎంత మంది తీసుకోగలరూ? శాస్త్రవేత్తగా ఆయన అందుకున్న స్థాయి గొప్పది. కానీ, మానవీయ విలువల్ని నిలుపడానికి తీసుకున్న నిర్ణయంతో ఆయన స్థాయి అనూహ్యంగా ఎన్నో రెట్లు పెరిగిపోయింది కదా? అందుకే చెప్పేది-స్థాయి అనేది కేవలం హోదాతోనే రాదు. తీసుకున్న నిర్ణయాలతో కూడా వస్తుంది!
ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తన సాపేక్ష సిద్ధాంతం గురించి అనేక విశ్వవిద్యాలయాల్లో ఉపన్యసించేవాడు. అతనితో పాటు అతని కారు డ్రైవరు కూడా ఆడిటోరియంలోకి వెళ్ళి వెనక సీట్లో కూర్చునేవాడు. అయితే ఎప్పుడూ ఐన్‌స్టీన్‌ ఉప న్యాసం శ్రద్ధగా వినేవాడు. మంచి గ్రహణ శక్తి గల డ్రైవర్‌ హ్యరీ ఒక సారి ఐన్‌స్టీన్‌ తో సరదాగా ఇలా అన్నాడు.
”ప్రొఫెసర్‌ సర్‌! నాకు మీ ఉపన్యాసం అంతా కంఠతా వచ్చేసింది అవకాశం ఇస్తే పొల్లు పోకుండా మీకు అంతా అప్పజెపుతా!”
”అవునా? అయితే వచ్చేవారం నువ్వే మాట్లాడుదువు గానీ- మనం వచ్చేవారం డార్ట్‌ మౌత్‌ అనే చోటికి వెళ్లాల్సి ఉంది. అక్కడి వాళ్లు నన్ను చూడలేదు కాబట్టి గుర్తుపట్టరు. అక్కడ నువ్వే నా బదులు మాట్లాడు. నేను వెళ్ళి వెనక సీట్లో కూర్చుని వింటాను” అని పెద్దగా నవ్వుతూ అన్నాడు ఐన్‌ స్టీన్‌. ఊరికే అనడం కాదు, దాన్నే నిజం చేశాడు. డ్రైవర్‌ హ్యారీ వెళ్ళి ఐన్‌స్టీన్‌ ఉపన్యాసాన్ని తు.చ. తప్ప కుండా సభికులకు అప్పజెప్పాడు. వెనక కూర్చుని విన్న ఐన్‌స్టీన్‌ డ్రైవర్‌ జ్ఞాపక శక్తికి అబ్బురపడ్డాడు. ఇంతలో ఒక ప్రమాదం జరి గింది. సభికుల్లోంచి ఒక ప్రొఫెసర్‌ గారు లేచి, ఒక కఠిన మైన ప్రశ్న అడిగాడు. డ్రైవర్‌ హ్యారీ దానికి సమాధానం చెప్పలేదు. అలాగని తను ఎవరన్నది చెప్పు కోనూ లేదు. అందుకే తన తెలివిని ప్రదర్శించాడు. ఐన్‌స్టీన్‌ స్థాయి ఎక్కడా తగ్గకుండా సమయస్పూర్తితో ఇలా అన్నాడు. ”ఇంతచిన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? దీనికి నా డ్రైవర్‌ వచ్చి చెపుతాడు ఒక్క నిమిషం ఆగండి!” – అంటూ వెనక్కి చూడకుండా- వెనక వరుసలో కూర్చున్న ఐన్‌స్టీన్‌ దగ్గరికి వెళ్ళాడు. ఐన్‌స్టీన్‌ గబుక్కున వెళ్ళి ఆ ప్రశ్నకు సామాధానం చెప్పాడు.
ఈ సంఘటనలో అంత పెద్ద శాస్త్రవేత్త అయి ఉండి కూడా ఒక చిన్న ఉద్యోగి డ్రైవర్‌ ప్రతిభకు కూడా అవకాశం కల్పించాడు ఐన్‌స్టీన్‌. ఒక రకంగా ప్రోత్సహించాడు. వేరే వాళ్ళయితే ”నీకేం తెలుసురా? నోరు మూసుకుని కూర్చో”- అని అనేవారు. ఇక్కడ డ్రైవర్‌ సమయస్పూర్తి అభినందించ దగింది. దాన్ని సరదాగా మన్నించిన ఐన్‌స్టీన్‌ హుందా తనం – ఎంత గొప్పదీ?
భారత తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జీవితంలో కూడా హుందాగా వ్యవహరించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తప్పుచేసిన వారిని మెత్తగా మందలించి, వారిని సరైన దారిలో పెట్టడం ఆయనకు చేతనయ్యేది. దేశ ప్రధానిగా ఒక స్థాయికి చేరడం ఒక ఎత్త యితే, మానవవాదిగా అందుకు ఎన్నోరెట్లు ఎది గి ప్రవర్తించడం ఆయన జీవితంలో చూస్తాం. నైతికంగా దిగజారి ఉన్నత పదవులు అలంకరిం చిన వారి గురించి ఏం మాట్లాడతాం? సమకా లీనంలో అలాంటి వారిని ఈ దేశ ప్రజలు ప్రత్య క్షంగా చూస్తున్నారు. అందుకే గతానికీ, వర్తమానానికీ పోల్చి చూసుకుంటున్నారు.
”జవహర్‌లాల్‌ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనాభావం పెరిగిపోతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్‌లా తయారయ్యే అవకాశం ఉంది. ఇది పార్టీ మనుగ డకు ఎంత మాత్రం సరైనది కాదు” – చాణక్య.
కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో కలం పేరుతో నెహ్రూ తన మీద తనే విమర్శనాస్త్రాలు సంధించుకునే వాడు. నెహ్రూ అంటే గిట్టని వారెవరో రాస్తున్నారని అం దరూ అనుకునేవారు ‘చాణక్య’-అనేది ఆయన కలం పేరని ఎవరికీ తెలిసేది కాదు. ఈ రోజుల్లో ఇలాంటి వారున్నారా? చదవడం, రాయడం వచ్చిన వారు అధికారంలో ఉండ డమనేది గతంలో- అక్టోబరు2,1957. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఒక కార్యక్రమం జరుగుతుండగా షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల షామియానా అంటుకుని మండిపోతోంది. హరీష్‌చంద్ర అనే కుర్రాడు కార్యక్రమంలో ఉన్న పండిత్‌ నెహ్రూని చేయిపట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు. తర్వాత 20 అడుగుల స్తంభం ఎక్కి జేబులోంచి కత్తి తీసి షామి యాన గుడ్డను కత్తిరించాడు. ఆ విధంగా వందలాది జనాన్ని ప్రమాదంలోంచి కాపాడాడు. ఈ ప్రయత్నంలో బాలుడు హరీష్‌ చంద్ర చేతులు కాలిపొయ్యాయి. ఇదంతా చూసిన నెహ్రూ చలించిపోయారు. సాహస బాలల అవార్డు నెలకొల్పారు. తొలిసారి తొలి అవార్డు ఆయనే హరీష్‌చంద్రకు అందించారు. అప్పటి నుండి 16సం||లోపు ఉన్న 25 మంది సాహస బాలలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందిస్తున్నారు. తొలి భారత ప్రధానిని రక్షించిన ఆ హరీష్‌చంద్ర 75 ఏండ్ల వయసులో అజ్ఞాత జీవితం గడిపాడని నవంబర్‌ 2023లో ఒక వార్త బయటికొచ్చింది. అది మళ్లీ వేరే విషయం.
”సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచి పోవడం కాదు. ఆ కాలంలో మనం ఏం చేశాం? ఎలా ఉన్నాం? ఏం సాధించాం? అన్నది ముఖ్యం!” అని అన్నాడు జవహర్‌లాల్‌ నెహ్రూ.
ఒకసారి నెహ్రూజీ పాల్గొన్న డిన్నర్‌లో ఒక సంఘటన జరిగింది. విలాసవంతమైన ధనవంతులు పాల్గొన్న ఆ పార్టీలో అన్నీ వెండి పాత్రలు, వెండి స్పూన్‌లు వాడారు. వెండి స్పూన్‌లు చూసేసరికి నెహ్రూ బృందంలో ఒకడికి ఆశ పుట్టింది. ఒక స్పూన్‌ మెల్లెగా కోటు జేబులో వేసు కున్నాడు. అది నెహ్రూజీ కంటపడింది. అయితే అందరి ముందూ చెప్పలేడు. ‘ఏదో రకంగా ఆ విషయం బయట పడితే పోయేది వాడి పరువు కాదు తన పరువు’-అనుకుని ఆ ప్రమాదాన్ని తప్పించడం ఎలాగా అని ఆలోచించాడు వెంటనే ఒక ప్రకటన చేశాడు.
”లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌! నేనొక మేజిక్‌ చేస్తా చూడండి. నా కోటు జేబులో స్పూన్‌ వేసుకుని మా వాడి కోటు జేబులోంచి తీస్తాను”- అన్నాడు. అందరూ ఆశ్చర్యం గా ఆయన వైపు చూశారు. నెహ్రూ అంతటి వాడు మేజిక్‌ చేస్తానంటే ఎందుకు చూడరూ? ఒక స్పూన్‌ అందరికీ చూపించి, తన కోటు జేబులో వేసుకున్నాడు. రెండుసార్లు చప్పట్లు చరిచి ఓ నాలుగుసార్లు చిటికెలు వేశాడు. ఏదో మేజిక్‌ అయిపోయినట్లు- ”యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌! చూడండి- స్పూన్‌ మా వాడు తన కోటు జేబులోంచి తీస్తాడు” – అని అన్నాడు. అవతల వాడికి మరో మార్గం లేదు, కోటు జేబులోంచి స్పూన్‌ తీసి, అందరికీ చూపుతూ టేబుల్‌ మీద పెట్టాడు. అంతే-అందరూ ఒహోహో-ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోతూ ఉంటే- ”ఆగండాగండి! మేజిక్‌ ఇంకా అయిపోలేదు. అదే స్పూన్‌కు రిప్లికా సృష్టిం చాను అది ఇప్పుడు మీ ముందు పెడతాను-” అని తన కోటు జేబులోని స్పూన్‌ కూడా తీసి అందరికీ చూపుతూ టేబుల్‌ మీద పెట్టాడు. గొప్ప రాజకీయ దురంధరుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ గొప్ప మెజీషియన్‌ కూడానా? అని అందరూ ఆశ్చర్యపోయారు. హాలు చప్పట్లతో మారు మోగిపోయింది. ఇందులో తప్పుచేసిన వాణ్ణి తెలివిగా బయట పడేయడం జరిగింది. హుందాగా మందలించడం కూడా జరిగింది. విజ్ఞత, వివేకం ఉన్న వారికే అది సాధ్యం!
మన బాల నరేంద్ర జీవితంలో కూడా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఆరో తరగతిలో ఆయన పేరు స్కూలు నుండి తొలగించడానికి ముందు ఐదో తరగతి పరీక్షలో ఒక ప్రశ్న ఇలా వచ్చింది ‘జగన్నాథ్‌ టెంపుల్‌ ఎక్కడ ఉంది?” బాల నరేంద్ర ముందు కూర్చున్న విద్యార్థి ‘పూరి’ అని రాశాడు. వెనక కూర్చుని కాపీకొట్టే మన నరేంద్ర కూడా ‘పూరి’ అనే రాద్దామను కున్నాడు. కానీ, మళ్లీ ఆలోచనలో పడ్డాడు. పూరి అని రాస్తే కాపి కొట్టానని తెలిసిపోతుంది కాబట్టి ‘చపాతి’ అని రాశాడు. ఇందులో హైలైట్‌ ఏమిటంటే-వాళ్ల టీచర్‌ ఇద్దరికీ రైట్‌ వేసి మార్కు ఇచ్చింది. హెడ్మాస్టర్‌ పరిశీలించి, ఇలా ఎందుకు ఇచ్చావ్‌ అని టీచరమ్మను అడిగితే, ‘ఆ పోనీండ్‌ సార్‌! ఆరెండింటికీ వాడేది ఒకే పిండి కదా?-‘అని అంది. హైడ్మాస్టర్‌ కండ్లు తిరిగి పడిపోయాడు. ఒకసారి గ్రౌండ్‌లో అడుకుంటున్న పుడు బాల నరేంద్ర ఫ్రెండ్‌ ఒక ప్రశ్న అడిగాడు.
”గాంధీజీ కొడుకు పేరేమిట్రా? నీకు తెలుసా?” అని అడిగాడు. తెలియదని చెప్పడం బాలనరేంద్ర ఇంటావంటా లేదుకదా? దీర్ఘంగా ఆలోచించి-
”దినేషన్‌” అని చెప్పాడు.
”కాదనుకుంటారా? ఆ పేరు ఎప్పుడూ విన్లేదు”- అన్నాడు ఫ్రెండు.
”నీ ముఖం! నీకేం తెలుసూ? ఫాదర్‌ ఆఫ్‌ దినేషన్‌- అని ఎప్పుడూ విన్లేదా? అని సీరియస్‌గా ముఖం పెట్టాడు బాల నరేంద్ర. ఆ ఫ్రెండుగాడు తల బాదుకుని ‘ఒరేరు! అది ఫాదర్‌ ఆఫ్‌ ద నేషన్‌ రా! దినేషన్‌ కాదు” అన్నాడు. … పకపకా నవ్వుతూ- ”అన్నింటికీ అలా తప్పులు వెతకకు మిత్రా! నేను పెరిగి పెద్దవాడినయ్యాక నీ అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తారా-” అని బతిమిలాడుకున్నాడు. బాల నరేంద్ర!
– కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు విజేత,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ (మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు