ప్రపంచవ్యాప్తంగా ఉదార, మధ్యేవాద రాజకీయ పార్టీలు బలహీనపడి దెబ్బతిని పోతున్నాయి. వామపక్ష శక్తులు బలంగా ఉన్నచోట్ల ఆ వామపక్షాలకు మద్దతు పెరుగు తోంది. అవి బలంగా లేనిచోట్ల పచ్చి మితవాద, ఫాసిస్టు శక్తులకు బలం పెరుగుతోంది. అమెరికన్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో కనిపిస్తున్న ఈ ధోరణికి అనుగుణంగానే ఉంది. ఫ్రాన్స్‌లో మాక్రాన్ పార్టీ బాగా బలహీనపడింది. అప్పటికప్పుడు హడావుడిగా కూడగట్టుకుని ఏర్పడిన వామపక్ష కూటమి బలంగా ముందుకు రావడంతో అక్కడ నయా ఫాసిస్టు శక్తులు ఆధిపత్యం సాధించకుండా అడ్డుకట్ట వేయడం సాధ్యపడింది. మన పొరుగున ఉన్న శ్రీలంకలో కూడా ఇదే మాదిరిగా వామపక్ష అభ్యర్ధి గణనీయంగా ఓట్లు పెంచుకుని దేశాధ్యక్ష పదవిని చేపట్టాడు. అక్కడ ఓడిపోయిన అభ్యర్ధి ఉదారవాద మధ్యేవాద పార్టీకి చెందినవాడు. ఇలా ఉదారవాద, మధ్యేవాద పార్టీలు అన్నిచోట్లా దెబ్బతినిపోవడం వర్తమాన కాలంలో ఉదారవాదం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని సూచిస్తోంది. రాజకీయ ఉదారవాదం ఆర్థిక నయా ఉదారవాదంతో గట్టిగా పెనవేసుకుని వుంది. ఆ నయా ఉదారవాద ఆర్థిక విధానాలే సంక్షోభంలో పడిపోవడంతో రాజకీయ ఉదారవాదం కూడా సంక్షోభంలో పడి దెబ్బ తినిపోతోంది.
సాంప్రదాయంగా ఉదారవాద రాజకీయ పార్టీలు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను బలపరుస్తూ వచ్చాయి. గతంలో అమలైన ఉదారవాద ఆర్థిక విధానాలను కాని, తర్వాత అమలౌతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలను కాని ఇవి అమలు చేస్తూ వచ్చాయి. ఈ రెండు రకాల ఆర్థిక విధానాలూ స్వేచ్ఛా మార్కెట్‌కు పెద్దపీట వేశాయి. మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యాన్ని కుదించడం అనేదానికి అత్యంత అధిక ప్రాధాన్యతనిచ్చాయి.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలోను, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తలెత్తిన మహా మాంద్యం కాలంలోను ఈ ఉదారవాద ఆర్థిక విధానాల వైఫల్యం స్పష్టంగా బయటపడింది. స్వేచ్ఛా మార్కెట్ విధానాలు అప్పు డప్పుడు తాత్కాలికంగా హుషారు పుట్టించవచ్చు. కాని అంతకుమించి అవి కార్మిక వర్గాన్ని దెబ్బతీసి, నిరుద్యోగాన్ని విపరీతంగా పెంచుతాయి. దాని ఫలితంగా పెట్టుబడి దారీ విధానం యావత్తూ ప్రమాదంలో పడి సోషలిజం బల పడటానికి దారితీస్తుంది. ఈ వైనాన్ని కీన్స్ చాలా పద్ధతి ప్రకారం వివరించాడు. అయితే అతడు స్వతహాగా ఉదారవాది. అందుచేత బలపడుతున్న సోషలిస్టు ప్రమాదాన్ని నివారించడం ఎలా అన్నదే ఆలోచించాడు. అందుకోసం ఒక కొత్త తరహా ఉదారవాదాన్ని అతడు ప్రతిపాదించాడు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం నిత్యం జోక్యం చేసుకుంటూ స్థూల డిమాండ్‌ను పెంచే దిశగా చర్యలు తీసుకుంటూ వుండాలని, అప్పుడు ఉపాధి అవకాశాలు బాగా పెరుగు తాయని కీన్స్ సూచించాడు. ప్రభుత్వ జోక్యాన్ని అంతకంతకూ తగ్గించాలనే సాంప్రదాయ ఉదారవాదానికి కీన్స్ చెప్పింది భిన్నంగా ఉంది.
కీన్స్ సిద్ధాంతాన్ని ద్రవ్య పెట్టుబడి ఏనాడూ అంగీకరించలేదు. ఇది కీన్స్‌కే అంతుబట్టలేదు. తన సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోలేకపోవడమే దీనికి కారణమని అతడు భావించాడు. కాని అసలు కారణం ఇంకా లోతైనది. ప్రభుత్వం గనుక జోక్యం చేసుకోవడాన్ని ఒక విధానంగా చేపడితే అప్పుడు పెట్టుబడిదారుల ఉనికి, వారు నిర్వహించే పాత్ర క్రమంగా సమాజ ఆమోదాన్ని కోల్పోతాయని పెట్టుబడిదారులు, ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి రంగంలో ఉన్న తరగతి ఆందోళన చెందారు (ఈ తరగతి పెట్టుబడిదారులను ‘పని లేని పెట్టుబడిదారులు’ అని కీన్స్ అభివర్ణించాడు.).వారి భయం నేటికీ కొనసాగుతోంది.
రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో కీన్స్ విధానాలు ప్రభుత్వ విధానాలుగా అమల్లోకి వచ్చాయి. ద్రవ్య పెట్టుబడి ఆ యుద్ధం వలన గణనీయంగా దెబ్బతినడంతో కీన్షియన్ విధానాలను స్వీకరించిన సోషల్ డెమోక్రసీ బలంగా ముందుకొచ్చింది. ఆ తర్వాత కాలంలో సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది. ద్రవ్య పెట్టుబడి మళ్లీ బలం పెంచుకుని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిగా పెరిగింది. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యం ఉన్నప్పటికీ మరొక తరహా సంక్షోభంలోకి జారిపోయింది. 1960, 1970 దశకాల్లో కనిపించిన ద్రవ్యోల్బణ సమస్యకు కారణం స్థూల డిమాండ్ తగినంత లేకపోవడమే. కాని సంక్షోభపు మూలాలు అంతకన్నా తీవ్రమైనవి. ఉపాధి అవకాశాలు ఎక్కువ మందికి రావడంతో పెట్టుబడిదారీ శక్తులు అదనపు విలువను ఆశించినంత మేరకు పొందలేకపోతున్నాయి. రెండోపక్క అంతకు ముందు వలసలుగా ఉన్న కాలంలో మూడవ ప్రపంచదేశాల నుండి ముడిసరుకును చౌకగా కాజేసినట్టు, వలసలు స్వాతంత్య్రం పొందిన తర్వాత కాలంలో చౌకగా పొందగలిగే ఏర్పాటు ఏదీ లేకుండా పోయింది. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి శక్తులు కీన్స్ విధానాలను తప్పుబట్టడం ప్రారంభించాయి. మళ్లీ పాతకాలపు స్వేచ్ఛా మార్కెట్ విధానాలు అమలైతేనే పరిష్కారం దొరుకుతుందని ప్రచారం మొదలుబెట్టాయి. ఈ ప్రచారానికి బూర్జువా ఆర్థికవేత్తలు తమ గొంతులు కలిపారు. క్రమంగా అన్ని ప్రభుత్వాలూ నయా ఉదారవాద విధానాలనే తమ ప్రభుత్వ విధానాలుగా అమలు చేయడం మొదలైంది.
తమ దేశాల్లోకి పెట్టుబడులను ఆకర్షించడం లేదా వచ్చిన పెట్టుబడులను వెనక్కి మళ్లకుండా నిలుపుకోవడం అనేది అన్ని ప్రభుత్వాలకూ ప్రధాన కర్తవ్యంగా మారిపోయింది. ఈ పరిస్థితిలో ఉదారవాద మధ్యేవాద పార్టీలు- వాటిలో ఎక్కువ భాగం సోషల్ డెమాక్రటిక్ పార్టీలు-కొన్ని చోట్ల వామపక్ష పార్టీలు సైతం, కీన్స్ విధానాలను పూర్తిగా విడిచిపెట్టి నయా ఉదారవాద విధానాలకే కొమ్ము కాశాయి.
అయితే నయా ఉదారవాద విధానాలు అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని కార్మికవర్గానికి, ఇటు మూడవ ప్రపంచ దేశాలలోని అన్ని తరగతుల కష్టజీవులకు భరించలేని కష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ విధానాలు ఏ సంక్షోభంలోనూ పడక మునుపే కష్టజీవులు కష్టాల్లో పడ్డారు. ఇక అవి సంక్షోభంలో చిక్కుకున్నాక శ్రామిక ప్రజల కష్టాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ప్రభుత్వ జోక్యంతో కీన్స్ విధానాలు అమలు జరిగిన కాలంలో సాధిం చిన వృద్ధిరేటు క్రమంగా నయా ఉదారవాద కాలంలో తగ్గిపోతూ వచ్చింది. 2008లో అమెరికాలో రియల్ ఎస్టేట్ బుడగ బద్దలైన దరిమిలా ఏర్పడ్డ సంక్షోభం అనంతరం ఈ వృద్ధిరేటు ఇంకా వేగంగా పడిపోతూ వచ్చింది. సంపద లోని అసమానతలు చాలా తీవ్రంగా పెరిగిపోవడంతో ప్రపంచపు స్థూల డిమాండ్ తగినంత లేకుండా పోయింది (స్వేచ్ఛా మార్కెట్‌లో ఉత్పత్తి మీద కూడా నియంత్రణ ఉండదు కనుక అది అధికోత్పత్తికి దారితీస్తుంది. అత్యధికుల వద్ద ఉండే సంపద తరిగిపోయి కొద్దిమంది దగ్గరే కేంద్రీకృతం కావడం వలన ఈ అధికోత్పత్తి చెల్లుబాటు కాదు. అందువలన సంక్షోభం అనివార్యంగా ఏర్పడు తుంది.) .అమెరికాలో రియల్ ఎస్టేట్ బుడగ పెరుగుతూన్నంత కాలమూ ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా వెనక్కి నెట్టగలిగారు. ఒక్కసారి ఆ బుడగ బద్దలవడంతో సంక్షోభం విరుచుకుపడింది. ఈ సంక్షోభాన్ని నయా ఉదారవాద విధానాల చట్రం లోపలే పరిష్కరించడం అసాధ్యం. మళ్లీ ఏదో ఒక బుడగను సృష్టిద్దామనుకున్నా, గతకాలపు చేదు అనుభవాలతో తలలు బొప్పికట్టిన ప్రజలు ఆ బుడగల పట్ల ఉత్సాహంగా స్పందించరు. వాస్తవానికి ద్రవ్య విధానంలో మార్పుల ద్వారా అటువంటి ఓ బుడగను సృష్టించే ప్రయత్నం జరిగింది. అదనపు డిమాండ్ ప్రజల దగ్గర లేకపోయినా, మార్కెట్‌లోకి అదనపు ద్రవ్యాన్ని ఈ ద్రవ్య విధానం ద్వారా (మానెటరీ పాలసీ) పంపి లాభాలను పెంచుకునే ప్రయత్నం జరిగింది. అది మరింత ద్రవ్యోల్బణానికే దారితీసింది. సంక్షోభం మరింత ముదిరింది.
ఇటువంటి పరిస్థితుల్లో మధ్యేవాద ఉదారవాద పార్టీలు నయా ఉదారవాద విధానాలతోటే ముడివేసుకుని ఉన్న కారణంగా, అవి చేయగలిగినది ఏమీ లేకుండా పోతోది. ప్రజల కడగండ్లను తీర్చగలిగే శక్తిని అవి కోల్పోయాయి. అందువలన ప్రజలు ఈ పార్టీలను విడిచిపెట్టి తక్కిన పార్టీల వైపు మళ్లుతున్నారు. వాటిలో అటు మితవాద అభివృద్ధి నిరోధక పార్టీలూ ఉన్నాయి, ఇటు వామపక్ష పార్టీలూ ఉన్నాయి. ఈ మితవాద అభివృద్ధి నిరోధక పార్టీలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కష్టాలను తొలగించగలిగే స్థితిలో లేవు. ఆ పార్టీలు కూడా నయా ఉదారవాద విధానాలను సమర్ధించేవే. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించే నినాదాలను ఇవ్వగలవు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పని ఆ నినాదాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అవి నయా ఉదారవాద విధానాలనే మరింత వేగంగా అమలు చేయడం ప్రారంభిస్తాయి. ఇటలీలో అధికారం చేపట్టిన మెలొనీ విధానాలు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రాన్స్ లో పచ్చి మితవాద మరైన్ లీపెన్ పార్టీ తాలూకు ప్రధానమంత్రి అభ్యర్థి ఇంకా ఎన్నికలకు ముందే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అనుకూలతను ప్రకటించేశాడు!
అయితే ఈ మితవాద పార్టీలు ఏదో ఒక రూపంలో రాజకీయ చర్చను ”బయటవాళ్లు” వైపు తిప్పుతాయి. ఈ ”బయటవాళ్లు” ఏదో ఒక మైనారిటీ మతానికి చెందినవారైనా కావచ్చు లేదా ఏదైనా మైనారిటీ జాతికి చెందిన వారు కావచ్చు లేదా బతుకు తెరువుకోసం బయటనుంచి వచ్చిన వారైనా కావచ్చు. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు ఈ ”బయటవాళ్లే” కారణమని ఆందోళనలు రెచ్చగొట్టి మితవాద పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకోడానికి పూను కుంటాయి. మరోవైపు ఉదారవాద మధ్యేవాద పార్టీలు అసలు ఏ సంక్షోభమూ లేనే లేదన్నట్టు ప్రవర్తిస్తాయి. ఇటు వంటి సందర్భాల్లో గుత్త పెట్టుబడిదారీ శక్తులు మితవాదుల వైపు, లేదా నయా ఫాసిస్టు శక్తుల వైపు మొగ్గి వాటికి తమ మద్దతునందిస్తాయి. రాజకీయంగా పరిస్థితులు చేజారిపోకుండా వుండాలంటే వాటి ముందున్న మార్గం అదొక్కటే. ఈ గుత్త పెట్టుబడిదారీ శక్తుల మద్దత్తు కోల్పోవడంతో ఉదారవాద, మధ్యేవాద పార్టీలు మరింత రాజకీయ సంక్షోభంలో పడతాయి.
పైకి చూసినప్పుడు ట్రంప్ ప్రకటించిన ఆర్థిక ఎజెండా ప్రభుత్వ జోక్యాన్ని మరింత పెంచే దిశగా ఉన్నట్టు అనిపించవచ్చు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను చైనా నుండి మాత్రమే కాక, యూరోపియన్ యూనియన్ దేశాల నుండి కూడా వచ్చిపడే దిగుమతుల తాకిడి నుండి కాపాడుతానని ట్రంప్ ప్రకటించాడు. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేం దుకు జోక్యం చేసుకోవడం అంటే అది నయా ఉదారవాద విధానాల నుండి పక్కకు మళ్లినట్టే కనిపిస్తుంది. కాని ట్రంప్ ఎక్కడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కదలికల మీద ఆంక్షలు పెడతానని ప్రకటించలేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి స్వేచ్ఛగా ఎక్కడబడితే అక్కడికి సంచరించడమే నయా ఉదారవాద విధానాలలో అత్యంత కీలకమైన అంశం. అంతేకాదు, అమెరికా మార్కెట్‌కు దిగుమతుల నుండి రక్షణ కల్పిస్తానని ట్రంప్ కన్నా ముందే ఒబామా కాలంలోనే చెప్పారు. ఇటువంటి రక్షణ విధానం వలన అమెరికాలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సరుకుల వరకూ కొంత ఊరట లభించవచ్చు. కాని దానివలన అమెరికాలో డిమాండ్ పెరగడం అనేది జరగదు. డిమాండ్ పెరగా లంటే ప్రభుత్వ వ్యయం పెరగాల్సిందే. అందుకోసం ద్రవ్యలోటు పెంచి రుణాలైనా తేవాలి లేదా సంపన్నుల మీద అదనంగా పన్నులైనా వేయాలి. కాని ట్రంప్ ఇప్పుడు విధిస్తున్న కార్పొరేట్ పన్నులనే మరింత తగ్గిస్తానని ప్రకటిం చాడు. కాబట్టి ప్రభ్తువ వ్యయాన్ని ట్రంప్ పెంచే ప్రసక్తే ఉండదు. ట్రంప్ కల్పించే రక్షణతో స్వల్పకాలం పాటు దేశీయ ఉత్పత్తులకు రక్షణ లభించడం మినహా ఇంకేమీ ఒరిగేది ఉండదు. ఆర్థిక మాంద్యంలో, సంక్షోభంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మరింత కూరుకుపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద మధ్యేవాద పార్టీలు దెబ్బతినిపోవడం అనే ధోరణికి అనుగుణంగానే అమెరికాలోనూ జరిగింది. అందుచేత ట్రంప్ ఎన్నిక ఆశ్చర్యం కలిగించదు. కాని అమెరికన్ ప్రజానీకం ట్రంప్ ప్రకటిం చిన ఆర్థిక ఎజెండా వెనుక నయా ఉదారవాద సూత్రాలే ఉన్నాయని గుర్తించలేకపోయారు. ట్రంప్ రక్షణాత్మక చర్యలు దేశీయ పరిశ్రమల్లో కొన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు. కాని అవే రక్షణాత్మక చర్యల వలన దిగుమతులు మరింత ఎక్కువ ఖరీదవుతాయి. దాని వలన ద్రవ్యోల్బణం తీవ్రం అవుతుంది. అది సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుండి బయట పడవేయగల ఎజెండా ఉన్నది వామపక్షాల వద్ద మాత్రమే. నయా ఉదారవాద విధానాలకు తెరదించడం ద్వారా ప్రత్యామ్నాయ విధానాలను అవి అమలు చేయగలవు. ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధాలకు సైతం అవి మాత్రమే ముగింపు పలకగలవు (ఈ యుద్ధాలు తలెత్తడంలోగాని, అవి కొనసాగడంలో గాని ఉదారవాద, మధ్యేవాద పార్టీలు ప్రధాన కారణం) ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వామపక్ష శక్తులు సమాయత్తం కావాలి.
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్ పట్నాయక్