తెలంగాణ విమోచన అయితే నిజాంకు శిక్ష ఏదీ?

What is the punishment for Nizam if Telangana is liberated?– మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని
– వాస్తవాలను వక్రీకరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌
– సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే :ఐద్వా సెమినార్‌లో సామాజిక కార్యకర్త దేవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘తెలంగాణ విమోచన అయితే నిజాం నవాబుకు శిక్ష ఏదీ?. భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనం అయ్యాక ఆయన్ను రాజ్‌ప్రముఖ్‌గా ఎందుకు ప్రకటించారు. ఖాసీం రజ్వీని పటేల్‌ సైన్యం ఎందుకు శిక్షించలేదు.’అని సామాజిక కార్యకర్త దేవి బీజేపీని ప్రశ్నించారు. ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- వాస్తవాలు-వక్రీకరణలు’అనే అంశంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ అబద్ధాలు, చరిత్ర వక్రీకరణలపైనే బీజేపీ ఆధారపడి ఉంటుందని విమర్శించారు. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ పని అని అన్నారు. అయినా చరిత్రలో ఉన్న సత్యాన్ని మరుగున పర్చలేరని చెప్పారు. చాకలి ఐలమ్మ మీద దాడి చేసింది రజాకార్లా లేదంటే దేశ్‌ముఖా, దొడ్డి కొమరయ్యను చంపించింది రజాకార్లా లేక దేశ్‌ముఖా?అని ప్రశ్నించారు. షేక్‌బందగీని విసునూరు దేశ్‌ముఖ్‌ చంపారని వివరించారు. ఆయన్ను నిజాం కాపాడలేదు, రజాకార్లు చంపలేదని చెప్పారు. ప్రజల మీద దాడులు, స్త్రీల మీద లైంగిక దాడులు, ఆకృత్యాలు జరిగినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడుందని అడిగారు. ప్రజలను హింసకు గురిచేసింది, వెట్టిచాకిరీ చేయించింది, దోపిడీ, అణచివేతకు పాల్పడింది హిందూ దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లేనని అన్నారు. నిజాం నవాబు కంటే ఎక్కువగా పీడించారని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగిందనీ, దానికి వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. ఆ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు లాఠీదెబ్బలు తినలేదనీ, జైళ్లకు వెళ్లలేదని గుర్తు చేశారు. అయితే ప్రజలను పీడించే వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ అండగా నిలబడిందని విమర్శించారు. ప్రజల విముక్తి కోసం నిజాం పాలన మీద, పటేల్‌ సైన్యం ఆకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి గుంజుకోవడం విమోచన అవుతుందా?అని బీజేపీని ప్రశ్నించారు. అందుకే విమోచన గురించి మాట్లాడే హక్కు బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదన్నారు. ప్రజల హక్కులు, కులవివక్ష నిర్మూలన పోరాటాన్ని కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహత్తరమైందని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రజలే తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందన్నారు. ప్రజలకు కమ్యూనిస్టులు అండగా నిలబడ్డారని అన్నారు. చరిత్రను వక్రీకరించే బీజేపీ విధానాలను దేశవ్యాప్తంగా ఎండగట్టాల్సిన అవసరముందన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి, కెఎన్‌ ఆశాలత, నాయకులు బుగ్గవీటి సరళ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.