‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో… ఓ పుస్తకం కొనుక్కో’ అంటారు విరేశలింగం పంతులు. అలాగే పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు. పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సంపదతో పాటు మానసికాభివృద్ధి జరుగుతుందని చాలా మంది ప్రగాఢ విశ్వాసం. పుస్తకాలు జ్ఞాన భాండాగారాలని మనకు తెలుసు. కానీ అన్ని పుస్తకాలు స్వయంగా సేకరించడం సాధ్యమయ్యే పని కాదు. పైగా అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే గ్రంథాలయాలు. నాగరికత పురోగతికి ప్రతీక గ్రంథాలయాలు. శతాబ్దాలుగా మానవ విజ్ఞానానికి సంరక్షకులుగా ఇవి ఉన్నాయి. కమ్యూనిటీ హబ్‌లుగా కూడా పని చేస్తున్నాయి. అవి మన సామూహిక చరిత్ర, సంస్కృతి, శాస్త్రీయ విజయాల భాండాగారంగా పని చేస్తాయి.
ఎన్నో రకాల పుస్తకాలు అక్కడ దొరుకుతాయి. కూర్చొని ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఉంటుంది. అటువంటి గ్రంథాలయాల విశిష్టతను సమాజానికి తెలియజేసేందుకే ప్రతి ఏడాది జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతున్నారు. కొత్త కొత్త పుస్తకాలు చదవాలంటే పాఠకులు తప్పనిసరిగా గ్రంథాలయాలకు వెళ్లాల్సిందే. గ్రంథాలయాలు సమాజానికి అవసరమైన మూలస్తంభాలు. జ్ఞానాన్ని పొందేందుకు సరైన మార్గం. ఏఐ యుగంలోనూ లైబ్రరీలు మనిషి జీవితంలో అనేక విధాలుగా కీలకపాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు చారిత్రక రికార్డులు భద్రంగా ఉండేలా చేస్తాయి. డిజిటల్ యుగం ఎంతగా ప్రభావితం చేస్తున్న భౌతిక లైబ్రరీలు మనకు స్పష్టమైన అనుభవాలను అందిస్తాయి. గతంతో మన అనుబంధాన్ని పెంచుతాయి. మానవ చరిత్రపై లోతైన అవగాహన కల్పిస్తాయి. మేధో ఉత్సుకతను ప్రోత్సహిస్తాయి.
మన ఆలోచనలను మార్పిడి చేసుకునే సమ్మిళిత ప్రదేశాలుగా లైబ్రరీలు పని చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అవసరమైన నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేస్తాయి. అభ్యాస అలవాట్లను ప్రోత్సహిస్తాయి. అన్నింటికీ గూగుల్‌లో వేదుకుతున్న ఈ రోజుల్లో మానవసంబంధాలు దెబ్బతింటున్నాయి. అదే లైబ్రరీల పునరుద్దరణ జరిగితే వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ‘పుస్తకాన్ని తాగితే ఆ అనుభూతే వేరు. అది మాటల్లో చెప్పలేనిది’ అని అనడం చాలా మంది నోటి నుండి వింటూనే ఉంటాం. అందుకే కేరళ రాష్ట్రం లైబ్రరీలకు అంత ప్రాముఖ్యం ఇస్తుంది. దేశంలోనే అత్యంత ఎక్కువ లైబ్రరీలు ఉన్న రాష్ట్రం ఇదే అంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. కనుకనే కేరళ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చిన ఏ రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధిలో ముందు పీఠన ఉంటుంది అనడానికి కేరళ రాష్ట్రమే చక్కటి ఉదాహరణ. కానీ మన దగ్గర పిల్లలు గ్రంథాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు మాత్రమే అక్కడకు వెళ్లాలి అనే భావన వచ్చేసింది. విద్యార్థులైతే తమ పాఠశాల పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాల జోలికి వెళ్లడం లేదు. పెద్దలు సైతం చాలా వరకు పుస్తకాలను అందం కోసం అల్మారాల్లో పెట్టుకునే వస్తువుల్లా చూస్తున్నారు.
అధ్యయన ప్రముఖ్యతపై అవగాహన కల్పించాలి. రాష్ట్రంలో గ్రంథాలయాల సంఖ్య విరివిగా పెరగాలి. పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు రేకెత్తించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దీనికి ప్రధాన భూమిక పోషించాలి. పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన పుస్తకాలు ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరానికి జ్ఞానాన్ని అందించాలి. ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆ విధమైన కర్తవ్యంతో ముందు వెళ్లాలని కోరుకుందాం.