16న సమ్మెకు సంఘీభావంగా ఎల్‌ఐసీ ఏజెంట్ల నిరసనలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర కార్మిక సంఘాలు-సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఎల్‌ఐసీ ఏజెంట్లుగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ శాఖ పిలపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్‌ఐసి బ్రాంచ్‌ల వద్ద యూనియన్‌ రాష్ట్ర నాయకులు ప్రచార క్యాంపెయిన్‌ నిర్వహించారు. అందులో ఎల్‌ఐసీ ఏఓఐ గౌరవాధ్యక్షులు జె. వెంకటేష్‌, ఏఐఐఇఎ జోనల్‌ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాధ్‌, జోనల్‌ సంయుక్త కార్యదర్శి జి. తిరుపతయ్య, హైదరాబాద్‌ డివిజన్‌ నాయకులు శ్రీనివాస్‌, గిరిధర్‌, మద్దిలేటి తదితరులను ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘం ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి సంగం వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌ డివిజన్‌ కన్వీనర్‌ గూడూరు ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వరంగ పరిరక్షణకు, రైతాంగ సమస్యల పరిష్కారానికి, దేశంలో కోట్లాది శ్రమజీవుల హక్కుల కోసం సాగుతున్న ఈ ఉద్యమానికి ఏఐఐఇఎ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రవీంద్రనాధ్‌, జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అవలంబించిన ఆర్ధిక విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ చర్యలతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు బలహీనపడు తున్నాయన్నారు. ఎల్‌ఐసీలో పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ తక్షణం చేయాలనీ, ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై విధిస్తున్న జిఎస్‌టిని రద్దు చేయాలని, ప్రభుత్వ ఖాళీలలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భారతదేశ స్వావలంబనను బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ప్రభుత్వరంగం అంటే కేవలం ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల ప్రయోజనాల వరకేనని భావించడం సరికాదని అన్నారు. తన్నీరు కుమార్‌ మాట్లాడుతూ దేశ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు లభ్యమవుతున్న అంశాన్ని విశాల దృష్టితో చూసి ఇన్సూరెన్స్‌తో సహా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం పౌరుల బాధ్యతనీ, ఈ లక్ష్యంతో ఫిబ్రవరి 16న జరగనున్న కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్‌ బంద్‌కు ప్రజలు మద్దతునివ్వాలని కోరారు.