లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి)లో ప్రభుత్వ వాటాల అమ్మకం మరోసారి జరగనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.ఇప్పటికే 2022లో 3.5శాతం వాటాలు అమ్మి, రూ 21వేల కోట్లు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంది. ‘సెబి’ నియమావళి ప్రకారం, ఒకసారి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థలు మూడేండ్లలో 25శాతం వాటాలు అమ్మాలి. అయితే,ఈ నిబంధనకు ఎల్‌ఐసికి మినహాయింపుతో మూడేండ్లు కాకుండా పదేండ్ల సమయ మిచ్చారు. దీనర్థం, 2032 మే లోపు, ఎల్‌ఐసి 25 శాతం వాటాలు విక్రయించాల్సి ఉంటుంది. మరి ఈలోగా ఐదు శాతం వాటాలు అమ్మాల్సిన అవసరం ఏమిటి? ఎల్‌ఐసి షేర్ విలువ భారీగా పెరిగిన దృష్ట్యా, ఒకవేళ ఐదు శాతం వాటాలు అమ్మితే, ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తుంది తప్ప, ఎల్‌ఐసికి ఒరిగేదేమీ లేదు.పైపెచ్చు, ప్రభుత్వ వాటాల అమ్మకం స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం.
స్వాతంత్రోద్యమ సమయంలో వెల్లివిరిసిన జాతీయ స్పృహలో అంతర్భాగమే బీమా జాతీయకరణ ఆలోచన.స్వాతంత్రోద్యమం కేవలం వలస పాలన నుండి విముక్తిని పొందడమే కాకుండా, స్వేచ్చాయుతమైన సమసమాజ స్థాపనను లక్ష్యంగా పెట్టుకుంది.దోపిడీని అంతమొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆకలితో ఉన్న లక్షలాది మంది నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సదస్సు ప్రకటించింది. 1934లో జరిగిన కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ సమావేశంలో పొందుపరిచిన చార్టర్ ఆఫ్ ఫ్రీడంలో ‘ప్రజల చిన్న మొత్తాల పొదుపులను జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్వ్యూహాత్మక స్థానాన్ని కలిగిఉండాలని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుందని రాసుకున్నారు’. అందువల్ల, ప్రజల పొదుపుపై ప్రభుత్వం నియంత్రణ కలిగి ఉండాలని, వాటిని ప్రయివేటు సంస్థల పరం చేయకుండా జాతీయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించు కోవాలనేదానిపై, స్వాతంత్రోద్యమం చాలా స్పష్టమైన అవగాహనతో ఉందని మనకు అర్ధమౌతుంది.
జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి అయిన కారణంగా, బీమా వ్యాపారం కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుచేతనే, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ గ్రంథంలో పేర్కొన్నారు. బీమా వ్యాపార నిర్వహణ, యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వానికి బదిలీ చేసే చట్టాన్ని అమలు చేయడానికి వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని జనవరి 12, 1948న రాజ్యాంగ అసెంబ్లీ తీర్మానించింది. ఆనాడు బీమా రంగంలో ఘోరమయిన పరిస్థితులు నెలకొన్నాయి. జీవిత బీమా రంగంలో పట్టదారుల సొమ్ము, భద్రత ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో మృగ్యం అని, పట్టదారుల సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయకరణ ఒక్కటే పరిష్కారమని జరిగిన ఉద్యమాల ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)ని నెలకొల్పింది. బీమా జాతీయకరణను మన రాజ్యాంగ అదేశిక సూత్రాల అధికరణలు 38, 39లో పొందుపరచబడిన విధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సౌధంగా చూడవచ్చు.ఆనాడు విదేశీ కంపెనీలు దేశీయ పొదుపును చేజిక్కుంచుకున్న వైనాన్ని చూసి కలవరడిన ఆనాటి ప్రధాని నెహ్రూ భారతీయ కంపెనీలను మాత్రమే సమర్ధించమని పిలుపునిచ్చారు. అందువల్ల, స్వాతంత్రోద్యమ ప్రమాణాల్లో ఒకటైన జీవితబీమా రంగ జాతీయకరణ, ఆధునిక సమసమాజ దేశ నిర్మాణ దార్శనికతలో ముఖ్య భాగంగా మారింది.
ఈరోజు ఏడాదికి రూ.3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్లు దేశాభివృద్ధికి పెట్టుబడులిచ్చే పరిస్థితి, ఎల్‌ఐసి పనితీరుకు అద్దం పడుతుంది. 1956 నుండి ఇప్పటివరకు 53 లక్షల కోట్ల ఆస్తులు ఆర్జించి, దేశ ఆర్థిక వ్యవస్థలో 43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, దాదాపు 27 కోట్ల పాలసీదారులకు ఎల్‌ఐసి విశేష సేవలందిస్తున్నది. ఇది ప్రపంచంలోనే అరుదైన ఘనత. ఎల్‌ఐసి దేశ సంక్షేమంతో పాటు దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థకు సైతం ఊతం అందిస్తున్నది. ఎల్‌ఐసి ఈక్విటీ పెట్టుబడులు యాభై పైగా కంపెనీలలో ఉండటం దీనికి తార్కాణం.2020 లో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసిలో వాటాలు అమ్మడానికి నాలుగు వాదనలు బడ్జెట్‌లో ముందుకు తెచ్చింది. అది లిస్టింగ్ వల్ల ఆర్ధిక క్రమశిక్షణ వస్తుందని, కాపిటల్ మార్కెట్ నుండి నిధులు సమీకరించే వీలు ఉంటుందని, ఎల్‌ఐసి నిజ విలువ అవిష్కారం జరిగి, చిన్న మదుపుదారులకు ఉపయోగం అని, సంస్థ మరింత పారదర్శకంగా ఉంటుందని.
ఎల్‌ఐసి ఎంత పారదర్శకంగా పనిచేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది బడ్జెట్ ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఎల్ ఐసిని మినహాయించి ప్రయివేటు బీమా కంపెనీలలో 2 లక్షల పైబడి ఫిర్యాదులు వచ్చాయని స్పష్టంగా పేర్కొన్నారు.ఎల్‌ఐసి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంది కాబట్టి, పార్లమెంట్ కు పూర్తి జవాబుదారీగా ఉంటుంది.ఎల్‌ఐసిలో నిరర్ధక ఆస్తుల విలువ కేవలం 0.33శాతం .260 లిస్టెడ్ కంపెనీలలో పెట్టు బడులు పెట్టడం ద్వారా ఎల్‌ఐసి ఆర్జించిన లాభాలు ఒక సంవత్సరంలో 2.3 లక్షల కోట్లు పెరిగాయి. (డిసెంబర్, 2022 నాటికి- : రూ. 9.61 లక్షల కోట్లు; డిసెంబర్, 2023 నాటికి :రూ 11.89 లక్షల కోట్లు.) దీనికి లిస్టింగ్‌కు ఎటువంటి సంబంధం లేదు.
పెట్టుబడుల ఉపసంహరణ వల్ల, రిటైల్ ఇన్వెస్టర్లు లాభపడతారు అనే వాదన అసంబద్దం. ఎల్‌ఐసి 2023-24 నివేదిక ప్రకారం మొత్తం షేర్ హౌల్డర్స్ సంఖ్య 27.5 లక్షలు కాగా,వారి చేతుల్లో ఉన్న షేర్ల సంఖ్య 9 కోట్ల పద్నాలుగు లక్షలు. అంటే సగటున ప్రతి రిటైల్ ఇన్వెస్టర్ చేతుల్లో 34 షేర్లు ఉన్నాయని అర్ధం.అదే సమయంలో 849 మంది సంస్థాగత(విదేశీ మరియు స్వదేశీ) మదుపుదారుల చేతుల్లో సుమారు 9.14 కోట్ల షేర్లు ఉన్నాయి.అంటే సగటున వీరొక్కక్కరి చేతుల్లో దాదాపు ఒక లక్షా పద్నాలుగు వేల షేర్లు ఉన్నాయి.మరి ఏ విధంగా సామాన్య,రిటైల్ మదుపుదారులు లాభపడినట్లు?
ఏ ప్రభుత్వ రంగ సంస్థలో వాటాలు అమ్మినా, ఇదే పరిస్థితి. రిటైల్ మదుపుదారులు అతి కొద్ది షేర్లు కలిగి ఉంటారు.అసలు హవా అంతా స్వదేశీ, విదేశీ మదుపుదారులదే !!ప్రభుత్వ రంగ సంస్థల లాభదాయకతకూ, వాటి షేర్ ధరలకు ఎటువంటి సంబంధం లేదు.ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల షేర్ ధరలు పెరగకుండా,స్టాక్ మార్కెట్‌లోని ‘తిమింగలాలు’ కుయుక్తులు పన్నుతాయి. ఎస్‌బిఐ షేర్ ధరను,ఇతర ప్రయివేటు బ్యాంకుల ధరను పోలిస్తే ఇదే అర్ధం అవుతుంది.ఏ లిస్టింగ్ కంపెనీలో అయినా షేర్‌ధర పెంచడానికంటూ కంపెనీని లాభాల వేటలో పరుగులు తీయించడం తప్ప , సామాజిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుందా? అందుకే, ఇటువంటి వృధా ప్రయత్నాలు మానుకుని, ఎల్‌ఐసిని మరింత బలోపేతం చేసే పనులు వేగవంతం చేయాలి.ప్రజల నమ్మకమే ఆలంబనగా ఎల్‌ఐసి పనిచేస్తూ నేటికీ మార్కెట్ లీడర్‌గా, మార్కెట్ మేకర్‌గా దూసుకుపోతున్న ఎల్‌ఐసిలో మరొక దఫా పెట్టుబడులు ఉపసంహరణ చేయడానికి ఎలాంటి ప్రాతిపదిక, అవసరం లేదు.
తిరుగులేని నమ్మకమంటే ఏమిటో వివరిస్తూ ప్రఖ్యాత రచయిత రాబిన్‌శర్మ ఇలా రాస్తారు. ‘ఒక విమానం గగనతలంలో ఎగు రుతూ తీవ్ర కుదుపులకు గురయ్యిందట. అందులో ప్రయాణించే ప్రయాణీకులు హాహాకారాలు చేస్తుంటే, ఒక చిన్నారి చాలా ధైర్యంగా కూర్చుంది.అది చూసి ఆశ్చర్యపోయి ఒక పెద్దాయన ఆ అమ్మాయిని ఎందుకంత ధైర్యంగా ఉండగలుగు తున్నావని ప్రశ్నిస్తాడు. దానికి ఆ చిన్నారి, ఈ విమానం నడిపే పైలట్ మా నాన్న. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నన్ను సురక్షితంగా ఉంచుతాడన్న నమ్మకం నాకుంది’ అందట!! తండ్రి పట్ల అటువంటి తిరుగులేని నమ్మకం కలిగి ఉన్నందుకు, ఆ పాపను అందరూ అభినందించారు.ఈ కథలో పాపలాగే కోట్లాది ప్రజానీకం ఎల్‌ఐసి పట్ల తిరుగులేని నమ్మకం కలిగిఉన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు సంభవించినా ఎల్‌ఐసి తమ వెనుక ఉందనే భరోసా వారికి ఉండబట్టే, బీమా రంగంలో అప్రతిహతంగా ఎల్‌ఐసి ప్రస్థానం కొనసాగుతోంది.
బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్-2024 వారి తాజా నివేదిక ప్రకారం ఎల్‌ఐసి సంస్థ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది.ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ 2023 లో 107వ రాంక్ పొందడమే గాక, మొత్తం ప్రీమియమ్ ఆదాయంలో ప్రపంచంలో10 వ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇందులో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు.నేడు దేశ బీమా రంగంలో ఉన్న 26 ప్రయివేటు బీమా కంపెనీలు అన్నిటినీ కలిపి, దేశంలో ఉన్న 79 శాతం జిల్లాల్లో బీమా కార్యాలయాలు కలిగి ఉంటే, ఒక్క ఎల్‌ఐసి సంస్థనే 92 శాతం జిల్లాల్లో కార్యాలయాలు కలిగి ఉంది.
దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్‌ఐసి వాటా 25 శాతం పై మాటే. 99 శాతం పైబడి క్లెయిమ్‌లను పరిష్కరించడం ద్వారా సంస్థ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి రెండు కోట్ల పైబడి క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే క్లెయిమ్ పరిష్కారంలో అత్యుత్తమ బీమా సంస్థగా పేరెన్నికగంది. ఏడాదికి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడుతోంది. అయినప్పటికీ ఆర్థికమంత్రి ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశీయ బీమా రంగం ఊసే ఎత్తలేదు. కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ తీసుకువచ్చి బీమా ప్రీమియమ్‌లపై 18శాతం పన్నుభారం మోపింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ భారం తొలగించాలని బీమా ఉద్యోగులు ఉద్యమిస్తూనే ఉన్నారు. తాజాగా మూడు వందలమందికి పైగా పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రాలను అందజేసినా ఫలితం శూన్యం. జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. బీమా ప్రీమియమ్‌లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే ఎల్‌ఐసి పాలసీదారులకి ఇంకా మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్‌ఐసిని ఆర్ధికంగా బలోపేతం చేస్తే, అది జాతీయోద్యమ స్ఫూర్తికి బలం చేకూర్చి , అంతిమంగా దేశానికి పాలసీదారులకు ఎంతో ప్రయోజనకరం.
– పి.సతీష్, 9441797900