హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కొత్తగా అందుబాటులోకి తెస్తోన్న బీమా సఖి యోజనను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీన్ని డిసెంబర్9న హర్యానాలోని పానిపట్‌లో ప్రధాని ఆవిష్కరించనున్నారని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హర్యానా సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని వెల్లడించింది. బీమా రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద మహిళలు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మారొచ్చు. తద్వారా వారు బీమాను విక్రయించి ఆదాయాన్ని పొందగలుగుతారు. మహిళా సాధికారత , ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నాలలో ఈ చొరవ తీసుకున్నట్టు ఎల్‌ఐసీ వర్గాల సమాచారం.