ముంబయి : పాకిస్థాన్ జీడీపీ కంటే ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) విలువ రెట్టింపుగా ఉంది. దేశంలో రెండు డజన్ల పైగా బీమా కంపెనీలు వచ్చినప్పటికీ.. ఎల్‌ఐసీ మెజారిటీ వాటాతో ఇప్పటికీ మార్కెట్ లీడర్‌గానే కొనసాగుతోంది. 2023-24 మార్చితో ముగిసిన ఏడాది నాటికి ఎల్‌ఐసీ పరిధిలోని ఆస్తుల విలువ (ఎయుఎం) రూ.51,21,887 కోట్లకు చేరింది. 2022-23 నాటి రూ.43,97,205 కోట్ల విలువతో పోల్చితే ఏడాదిలోనే 16.48 శాతం వృద్థిని సాధించింది. రూ.51.21 లక్షల కోట్లు.. డాలర్లలో 616 బిలియన్ డాలర్లకు సమానం. కాగా.. పాక్ జీడీపీ విలువ 338.24 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో పాక్ జీడీపీ కంటే ఎల్‌ఐసీ ఆస్తుల విలువ రెట్టింపుగా ఉండటం విశేషం.