– పూర్తయిన స్వాధీన ప్రక్రియా
– పలు పథకాల విలీనం
హైదరాబాద్ : ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థను దిగ్గజ ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన విలీన ప్రక్రియ జులై 29న పూర్తయ్యిందని ఎల్ఐసీ ఎంఎఫ్ సోమవారం వెల్లడించింది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలను మరింత విస్తరించడానికి వీలు దక్కిందని తెలిపింది. వద్ధి చెందుతున్న అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో అవకాశాలను ఒడిసిపట్టడంలో రెండు సంస్థల సమ్మిళిత బలం ఎల్ఐసీ ఎంఎఫ్కి సహాయపడతాయని తెలిపింది. అదే విధంగా పెట్టుబడిదారులు, పంపిణీ భాగస్వాముల విలువను పెంచనున్నాయని పేర్కొంది. 2023 జూన్ 30 నాటికి ఎల్ఐసీ ఎంఎఫ్ ఎయుఎం రూ.18,400 కోట్లు, ఐడీబీఐ ఎంఎఫ్ ఎయుఎం రూ.3,650 కోట్లుగా ఉంది. విలీనం పూర్తయిన తర్వాత ఐడీబీఐ ఎంఎఫ్లోని 20 పథకాల్లోని 10 ప్లాన్లు ఎల్ఐసీ ఎంఎఫ్ల్లోని ఫీచర్లతోనే ఉన్నాయని వాటిని విలీనం చేయనున్నారు. మరో 10 పాలసీలను ఎల్ఐసీ ఎంఎఫ్ కొనసాగించనుంది. ఇకపై మొత్తం ఎల్ఐసీ ఎంఎఫ్లో 38 స్కీములు అందుబాటులో ఉండనున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ”భారతదేశంలోని కీలక మార్కెట్లలో పెట్టుబడి అవసరాలను తీర్చడానికి విభిన్నమైన మ్యూచువల్ ఫండ్ హౌస్గా సేవలందించేలా మా సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్న క్రమంలో ఇది మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, గోల్డ్ ఫండ్, పాసివ్ ఫండ్ సెగ్మెంట్లు మొదలైన వాటిలో మా స్కీమ్ ఆఫర్లను విస్తృతం చేయాలనే మా లక్ష్యాన్ని ఈ విలీనం తీర్చనుంది. ఈ విలీనం విస్తృత శ్రేణీ మార్కెట్లో చేరుకునేందుకు తోడ్పడనున్నాయి. అభివృద్థి చెందుతున్న అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలను ఒడిసి పట్టడంలో, పెట్టుబడిదారులు, పంపిణీ భాగస్వాముల కోసం విలువను పెంచడంలో మా సంయుక్త బలం మాకు సహాయపడుతుంది.” అని ఎల్ఐసీ ఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టి ఎస్ రామకృష్ణన్ అన్నారు.