– మూడు కంపెనీల్లోని 3.72 కోట్ల స్టాక్స్ అమ్మకం
ముంబయి: అదానీ గ్రూప్‌లో ప్రధాన సంస్థాగత ఇన్వెస్టర్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరే షన్ (ఎల్‌ఐసీ) భారీగా షేర్లను విక్రయించింది. 2023 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కోట్లాది షేర్లను విక్రయించి లాభాల స్వీకరణకు మొగ్గు చూపింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌ల్లోని దాదాపు 3,72,78,466 షేర్లను అమ్మేసింది. మరోవైపు అంబూజా సిమెంట్‌లో కేవలం 4500 షేర్లను కొనుగోలు చేసింది. అదానీకి చెందిన మూడు కంపెనీల్లో భారీగా వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ భారీ లాభాలను స్వీకరించిందని తెలుస్తోంది. అదానీ గ్రూపు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ షేర్ల విలువ అమాంతం పడిపోయింది. ఆ సమయంలోనూ ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టడం ప్రతి పక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. జనవరి 27 నాటికి అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి మొత్తంగా రూ.56,142 కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. 2023 సెప్టెంబర్ చివరి నాటికి రూ.45,025 కోట్ల పెట్టుబడు లుండగా.. డిసెంబర్ ముగింపు నాటికి రూ.58,374 కోట్లకు చేరాయి. 2023 సెప్టెంబర్ ముగింపు నాటికి అదానీ ఎనర్జీలో ఎల్‌ఐసీ వాటా 3.68 శాతంగా ఉండగా.. డిసెంబర్ ముగింపు నాటికి 3 శాతానికి తగ్గించుకుంది. గడిచిన త్రైమాసికంలో ఈ స్టాక్ 42 శాతం పెరిగింది. కాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 4.23 శాతం నుంచి 3.93 శాతానికి కోత పెట్టుకుంది. ఈ సూచీ నిఫ్టీలో 29 శాతం ర్యాలీ చేసింది. అదాని పోర్ట్స్‌లో సెప్టెంబర్ ముగింపు నాటికి 9.07 శాతం వాటా ఉండగా.. డిసెంబర్ ముగింపు నాటికి 7.68 శాతానికి తగ్గించుకుంది. ఇదే సమయంలో అదానీ పోర్ట్స్ సూచీ 46 శాతం లాభపడింది. ఈ ఒక్క కంపెనీలోనే ఎల్‌ఐసీ రూ.20,000 కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఉన్నాయి. గతేడాది చివరి త్రైమాసికంలో అదానీ గ్రూపునకు చెందిన ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ సూచీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు యథాతథంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో అదానీ గ్రూపులోనే అదానీ గ్రీన్ సూచీ అత్యధికంగా 73 శాతం పెరగడం విశేషం. కాగా.. అంబూజా సిమెంట్స్‌లో 4500 షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఇందులోని ఎల్‌ఐసీ వాటా 6.29 శాతంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కూడా అదానీ గ్రూపుల్లోని స్టాక్స్ ఎల్‌ఐసి విక్రయించి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.