ప్రాణం ఖరీదు

ఆత్మహత్యలకు కారణాలు అనేకం. కొన్నేండ్లుగా టీనేజర్స్‌పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అపరిమితమైన ఫోన్‌ వాడకం, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ దీనికి ఓ కారణమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలాగే సినిమాల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. చిన్న విషయాలకే మనస్థాపానికి గురౌతున్నారు. మానసికంగా బలహీనమవుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమ, పెండ్లి అనే ఆలోచనలతో పిచ్చివారైపోతున్నారు. సామాజిక విలువలకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులను, సాటి మనుషులను గౌరవించడం, ప్రేమించడం మర్చిపోతున్నారు. ఇలాంటి విద్యను అందించే వారే కరువౌతున్నారు. మార్కులు, ర్యాంకులు తప్ప మరేమీ పట్టని పాఠశాలలు, కళాశాలలు పెరిగిపోతున్నాయి. ఆడాల్సిన వయసులో శారీరక ఆటలు లేవు. ఈ ఒత్తిడి పిల్లల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
ఈ సృష్టిలో అత్యంత విలువైనది ప్రాణం. అందుకే ప్రాణాపాయంలో ఉన్న మనిషికి వైద్యం చేసి ఊపిరి నిలిపే వైద్యుడిని అందరూ దేవునితో సమానంగా భావిస్తారు. ప్రాణాలను కాపాడుకునేందుకు మనిషి ఏమైనా చేస్తాడు. ఎంత దూరమైనా పరిగెడతాడు. డబ్బు వస్తుందంటే ఎదుటి వారి ప్రాణం తీస్తారేమో కానీ, కోట్లు వస్తాయన్నా తమ ప్రాణం తాము తీసుకోరు. ‘బతికుంటే బలసాకైనా తిని బతకొచ్చు’ అనే సామెత ఊరికే పుట్టలేదు..!
అలాంటి ప్రాణాన్ని నేటి యువత క్షణికావేశంలో పోగొట్టుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మైనర్‌ జంట తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరేమోననే భయంతో ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు విన్నపుడు, కన్నపుడు మనకే మనసు విలవిలలాడిపోతున్నది. ఇక నవమాసాలు మోసి, కని, పెంచిన కన్నవారి కడుపుకోత ఎలా ఉంటుంది..? కండ్ల ముందే పిల్లలు విగతజీవులైతే… ఆ గుండె భారం మాటల్లో చెప్పనలివి కానిది. అక్షరాల్లో రాయలేనిది.
ఈ ఒక్క సంఘటనే కాదు ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. పరీక్షల్లో ఫెలయ్యామని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని, తల్లిదండ్రులు కోప్పడ్డారని చివరకు అడిగింది కొనివ్వలేదనే కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జన్మనిచ్చిన తల్లికి సైతం ప్రాణం తీసే హక్కు లేదు. అంతెందుకు మన ప్రాణం తీసుకునే హక్కు మనకే లేదు. అందుకే ఆత్మహత్య నేరమని చట్టం చెబుతున్నది.
ఆత్మహత్యలకు కారణాలు అనేకం. కొన్నేండ్లుగా టీనేజర్స్‌పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అపరిమితమైన ఫోన్‌ వాడకం, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ దీనికి ఓ కారణమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలాగే సినిమాల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. చిన్న విషయాలకే మనస్థాపానికి గురౌతున్నారు. మానసికంగా బలహీనమవుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమ, పెండ్లి అనే ఆలోచనలతో పిచ్చివారైపోతున్నారు. సామాజిక విలువలకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులను, సాటి మనుషులను గౌరవించడం, ప్రేమించడం మర్చిపోతున్నారు. ఇలాంటి విద్యను అందించే వారే కరువౌతున్నారు. మార్కులు, ర్యాంకులు తప్ప మరేమీ పట్టని పాఠశాలలు, కళాశాలలు పెరిగిపోతున్నాయి. ఆడాల్సిన వయసులో శారీరక ఆటలు లేవు. ఈ ఒత్తిడి పిల్లల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
తల్లిదండ్రులు పిల్లలతో గడపడం లేదు, మాట్లాడడం లేదు. ఫలితం… వారి మనుసులోని ఆనందాలు, బాధలు, ఒత్తిడి చెప్పుకునే మనుషులు వారితో లేరు. ఒంటరితనం ఎక్కువయింది. పిల్లలకు మంచి చదువు, కెరీర్‌ అందించామా లేదా అని చూస్తున్నామే తప్ప, మంచి జీవితాన్ని ఇస్తున్నామా లేదా అని ఆలోచించడం లేదు. మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఆరాటపడుతున్నాం తప్ప మంచి మనుషులుగా ఎదుగుతున్నారా లేదా అనే స్పృహ ఉండడం లేదు. సమూహంలో బతికే ధైర్యాన్ని నేర్పడం లేదు. పిల్లల మనసులో ఏముందో గుర్తించడం లేదు. అందుకే పెద్దలు మారాలి. పిల్లలతో గడపాలి. వారు చెప్పింది వినాలి. వారి లేత మనుసుల్లోని భావాలు స్వేచ్ఛగా పంచుకోవాలి. జీవితం పట్ల ప్రేమను పెంచాలి. అటువంటి విలువలతో కూడిన శాస్త్రీయ విద్య అందించాలి. ఆ విద్య వారిలోని ఒత్తిడిని తరిమెయ్యాలి. యువత కూడా జీవితం విలువను, దాని గొప్పతనాన్ని గుర్తించాలి. ఎటువంటి ఓటమినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
– సలీమ