బతుకంటేనే కష్టసుఖాల కలయిక. కష్టమొచ్చిందని బాధపడడం, సంతోషం కలిగిందని చిందులేయడం రొటీనే. కష్టాన్ని కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా భావిస్తే ఆ కష్టమే సంతోషంగా మారిపోతుంది..ఏ మనిషికైనా జీవితం ఒక్కటే. గెలిచినా ఇదే. ఓడినా ఇదే.. కాబట్టి కష్టానికి భయపడకుండా బతుకంతా ఎంజారు చేయమని ఈ పాట ద్వారా చెబుతున్నాడు గీతరచయిత వెనిగళ్ళ రాంబాబు. 2009 లో ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మనోరమ’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
డా. వెనిగళ్ళ రాంబాబు తెలుగు సాహిత్యంపై మంచి పట్టు ఉన్న కవి. శబ్దంపై విశేషమైన అధికారమున్న కవి. తెలుగు ప్రొఫెసర్.. అటు వృత్తిని, ఇటు గీతరచయితగా తన ప్రవృత్తిని రెండింటిని కళ్ళుగా చేసుకుని సాగిపోతున్న ప్రతిభాశాలి.
‘మనోరమ’ సినిమాలో ఆయన రాసిన పాట చాలా అద్భుతంగా ఉంది. ఇందులో హీరోయిన్ జీవితమంతా వినోదంగా గడపాలని, హాయిగా, ప్రశాంతంగా బతుకంతా గడిచిపోవాలని చెబుతుంటుంది. కోపతాపాలున్నా, ఎడతెగని సమస్యలున్నా వాటిని లెక్కచేయకుండా సాగిపోవాలని చెబుతుంది.
బతుకంటేనే ఎంజారు.. బతుకంతా మరి ఎంజాయే.. జాలీగా ప్రపంచమంతా చుట్టేసి గడిపేయాలంటుంది. అయితే.. ఇక్కడ డబ్బంతా ఖర్చు పెట్టి విలాసాలతో గడిపేయమని కాదు చెప్పింది.. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బతకమని, లేని దాని కోసం ఆరాటపడవద్దని చెప్పడం కనిపిస్తుంది. డబ్బున్న రోజుల్లో బెంజ్ కారుల్లో తిరుగు.. లేని రోజుల్లో గంజినీళ్ళు తాగి బతుకు. బెంజ్ కారుల్లో తిరిగినపుడు ఎంత హాయిగా ఎంజారు చేశావో, గంజినీళ్ళు తాగినపుడు కూడా అంతే హాయిగా ఎంజారు చేయమని కవి సందేశం..
ప్రతిరోజు యువరాణిలాగా బతకాలి.. నిండుగా నవ్వితే గుండె నిండా ఎంజాయే.. తృప్తితో బతుకు గడిపితే అంతా ఎంజాయే.. ఇదే జీవన రహస్యం.
నిన్నటిరోజున మనం చేయవలసిన పని మిగిలిపోయిందని దాన్ని రేపు చేద్దామని వాయిదా వేయడం సరికాదు. నిన్నటి పని నిన్ననే చేయాలి. వాయిదాలు వేస్తూ ఈరోజుని గడపడం, రేపటికి చూసుకుందాంలే అనుకోవడం సరికాదు. గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు. మన చేతుల్లో లేనిది కాలమొక్కటే.. ఈ మాట మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ కష్టం నాకిష్టం అనుకుంటూ బతుకుబాటలో సాగిపోవాలి.. అంతే కాని అక్కడే ఆగిపోకూడదు. ప్రతీ నిమిషం చిరునవ్వే నా సిద్ధాంతం.. నవ్వును ముఖం నుంచి చెరగనివ్వను.. అంటూ నవ్వును ఆయుధంగా, సాధనంగా చేసుకుని నడవమని ఈ పాటలో హీరోయిన్ చెబుతుంది. ఈలలా, చిరుగాలిలా సాగినా ఎంజాయే.. చుక్కల్లో చేరినా ఎంజాయే.. దేనినైనా ఎంజారు చేస్తానంటుంది.
ఇక రెండవ చరణంలో.. ప్రేమ గురించి సందేశం చెప్పడం మనం గమనిస్తాం. ప్రేమకు ఒక సీజన్ ఉండదు. అది ఇప్పుడు పుడుతుంది, ఇప్పుడు పుట్టదు అనేది ఉండదు. దానికి ఒక ఋతువు, సమయమూ ఉండదు. అది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిలో పుడుతుందో తెలియదు. ప్రేమకు కారణం కూడా ఉండదు.. మరి అలాంటప్పుడు ప్రేమించడానికెందుకు భయం. కాని నిన్ను ప్రేమించమని అడిగితే నో అని చెప్పు.. నిన్ను ప్రేమిస్తున్నానని అంటే ఎస్ అని చెప్పు..అని పాడుతుంటుంది హీరోయిన్. ఈ ప్రేమే మనకు ప్రాణం పోసే ఆక్సిజన్ లాంటిది..అయినా ఈ ప్రేమ అర్థం కాని ఒక కన్ ఫ్యూజన్‌లా కనబడుతుంది. ఈ ప్రేమకు పరిష్కారమంటూ ఉందా? అని సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. చేపలా ఈదినా, పసిపాపలా ఆడినా.. చిలకలా పైకెగిరినా.. అంతా ఎంజాయే.. అని చెబుతుంటుంది..
జీవితం విలువను తెలిపిన పాట ఇది. చిన్న చిన్న సమస్యలకే భయపడి ఆత్మహత్యలు చేసుకుంటూ, నిండు జీవితాన్ని కోల్పోతున్న ఎంతోమంది పెద్దలకు, యువకులకు సందేశాన్నిస్తుందీపాట.. అద్భుతమైన తెలుగు, ఇంగ్లీష్ పదాలతో ఈ పాటను అందరి హృదయాలకెక్కేలా రాశాడు రాంబాబు. సీజను, రీజను, తాజను, ఆక్సిజను, కన్‌ఫ్యూజను, సొల్యూషను వంటి రైమింగ్ ఉన్న ఇంగ్లీష్ పదాల్ని కూడా భలే వాడాడు. చేపలా, పసిపాపలా, ఈలలా, చిరుగాలిలా… వంటి పదాలు స్వేచ్ఛకు ప్రతీకలై ప్రకాశిస్తున్నాయి. రాంబాబు కవితాశక్తిని తెలియజేస్తుందీపాట..
పాట:-
స..సయ్యరా.. లైఫంటేనే ఎంజారు/ లైఫంతాను ఎంజారు/ ఎంజారు.. ఎంజారు.. ఎంజారు/ యు సీ ద బేట్స్ గారు/ వెరి హాయి ఇన్ ద స్కై/ ఇట్స్ జాలీ ట్రిప్ ఎంజారు/ ఉన్నరోజు బెంజ్ కారుతో ఎంజారు/ లేనిరోజు గంజినీళ్ళతో ఎంజారు/ ఎవ్రీ డే యువరాణిలా ఎంజారు.. జారు/ నిండుగా నువు నవ్వితే నీ గుండెకు ఎంజాయే/ తృప్తిగా నువు బ్రతికితే ఎంజాయే/ నిన్నొకపని మిగిలిందని రేపది చేద్దాం లెమ్మని/ ఈరోజంతా ఆగటం నో..నో../ కాలం మళ్ళీ రాదని అది మన చేతుల్లో లేదని/ పెద్దలు చెప్పారెప్పుడో యు..నో/ ఈ కష్టం నష్టం ఐ డోన్ట్ కేర్ అన్నీ నాకిష్టం/ ఎనీటైమ్ స్మైలింగే నా సిస్టమ్/ ఈలనై.. చిరుగాలినై చెలరేగినా ఎంజాయే/ చుక్కలే నే చేరినా ఎంజాయే/ లవ్వుకు లేదే సీజను/ లవ్వుకు లేదే రీజను/ లవ్ చేయడానికి ఎందుకోరు తాజన్ /లవ్ మి అంటే నో అను/ లవ్ యు అంటే ఎస్ అను/ లవ్వేనోరు నీ లైఫ్ కు ఆక్సిజన్/ ఎందుకో ఈ లవ్వంటేనే ఏదో కన్ ఫ్యూజన్/ అసలుందా ఈ లవ్వుకు సొల్యూషన్/ చేపనై పసిపాపనై చిందేసినా ఎంజాయే/ చిలకనై పైకెగిరినా ఎంజాయే..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682