నేటి ఆధునిక యుగంలో ఆటవిక కులదురహంకార హత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చదువుకున్న మూర్ఖులే కులం పట్టింపులకు లోనవు తున్నారు. ‘మాది అగ్రకులం, మా పరువు పోయింది’ అనే పేరుతో ఉన్మాదం తలకెక్కించుకొని ప్రాణ మిత్రుడిని సైతం పాతిపెడు తున్నారు. శాస్త్ర,సాంకేతిక రంగం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంటే సాటిమనిషిని తక్కువ కులం పేరుతో హతమరుస్తున్న మధ్యయుగాల కాలం నాటి మానసికస్థితి నేటికీ కొనసాగు తుండటం ఆందోళనాకరం. ఇది మనదేశ వెనుకబాటుతనం.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న సూర్యాపేట జిల్లా, మండలం పిల్లలమర్రి వద్ద ఓ దళిత యువకుడు కిరాతక హత్యకు గురయ్యాడు. బావిలో శవమై తేలాడు. ‘కులం తక్కువవాడితో నా చెల్లెలు కాపురాన్ని కొనసాగనివ్వమని’ తన బావమరుదులే అతన్ని కడతేర్చారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కష్ణ అలియాస్ మాల బంటి పిల్లలమర్రికి చెందిన కోట్ల భార్గవి గత మూడేండ్లుగా ప్రేమించుకున్నారు. 2024 ఆగస్టు 7న నకిరేకల్ ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. వారి పెండ్లి తర్వాత భార్గవి అరవైఐదేండ్ల కోట్ల భిక్షమమ్మ (నాయనమ్మ) ‘ఆది మాలోడిని చేసుకుంటే మన పరువుంటుందా? మనకులంలో తలెత్తుకుని ఎలా తిరగాలి? వాడిని బతకనియద్దు’ అంటూ భార్గవి సోదరులు నవీన్, వంశీలను రెచ్చగొట్టింది. అంతేకాదు, ‘వాడి శవాన్ని నేను కళ్లారా చూడాలి. మీరు మన కులం పరువు నిల బెట్టాలని’ చెప్పింది. నాయనమ్మ మాట ప్రకారం గతంలో ఓసారి హత్యకు పథకం వేసి విఫలయ్యారు. తర్వాత ఇరువురి స్నేహితుడైన బైరి నరేష్ సహకారంతో బంటిని హత్యచేసి శభాష్ అనిపించుకున్నారు. వాస్తవానికి బంటి, నవీన్, వంశీ, నరేష్ స్నేహితులు. కులం ముందు దోస్తానా కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా, ఇప్పుడు నిలబడిందా, భార్గవి జీవితం ఏమైపోవాలి? తమకు ఇష్టమైనవారిని కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం కూడా నేరమా, చట్ట విరుద్దమా?
భార్గవి తన పెండ్లి తర్వాత కుటుంబ సభ్యులు మూడునెల్లపాటు ఆమెను నానా వేధింపులకు గురిచేశారు. తమ మాటకాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని ఎలా పెండ్లి చేసుకుంటావని గొడవకు దిగారు. వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అయితే తాను మేజర్‌నని, ఇష్టపూర్వకంగానే బంటిని పెండ్లి చేసుకున్నాని భార్గవి చెప్పడంతో పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.అయినా వారు మారలేదు. బంటిని హత్య చేయడానికే నిర్ణయించుకున్నారు. మరో స్నేహితుడు బైరి మహేశ్ సాయం తీసుకుని హత్యకు కుట్రపన్నారు. ఇందులో నాయనమ్మది ప్రధానపాత్ర. వేరే కులానికి చెందిన వ్యక్తిని తన మనవరాలు పెండ్లి చేసుకోవడం, పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. పరువు.. పరువు అంటూ రాత్రి, పగలు తన మనవళ్లను రెచ్చగొట్టింది. తన మనవరాలిని పెండ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని చంపాలని ఆదేశించింది. నాయనమ్మ కోరిక తీర్చేందుకు, ఆమె కండ్లల్లో ఆనందం చూడాలని ఆ మనవళ్లు ఇద్దరూ బార్గవి భర్తను అత్యంత క్రూరంగా చంపారు. కారులో మతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ‘ఇదిగో చంపాం చూడు’ అంటూ నాయనమ్మకు బంటి శవాన్ని చూపించగా ‘మీరిద్దరూ నా పరువు కాపాడారు’ అంటూ రక్తంతో తడిసిన తన మనవళ్ల చేతులు చూసి ఆమె ఆనందపడింది. తన ఆఖరి కోరిక తీర్చినందుకు వారిని ముద్దాడింది. ఇంతటి కులఉన్మాదాన్ని రెచ్చగొడుతూ సాటి మనిషి అనే తేడా లేకుండా హత్య చేయించడం ద్వారా ఆరుపదుల వయసు దాటినా ఆ వృద్ధురాలు ఏం సాధించింది? తన మనవరాలి నిండుజీవితాన్ని కాలరాసింది. అంతేకాదు, ఆమెను వితంతువుగా మార్చింది. ఈ ఘటన తర్వాత భార్గవి సోదరులు నవీన్, వంశీ, తండ్రి సైదులు, నాయనమ్మకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ ఆ వృద్ధురాలు భిక్షమమ్మలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. భర్తని కోల్పోయిన భార్గవి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. ‘వద్దని చెప్పినా కులంతక్కువోడిని పెండ్లిచేసుకున్నందుకు నా మనవరాలికి తగిన శాస్తి జరగాల్సిందే’ అందంటే ఆమె క్రూరత్వానికి ఇంతకాన్న నిదర్శనమేముంటుంది?
వడ్లకొండ కష్ణ (బంటి) కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే హదయం చలిస్తుంది. తల్లి లేదు, తండ్రి వద్ధుడు. తండ్రిని పోషించే వారెవరూ లేరు. అక్కకు వివాహమై మణుగూరలో ఉంటోంది. ప్రస్తుతానికి గుంటస్థలం, రేకుల ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు ఆ వృద్ధుని బాధ్యత ఎవరిది? ఇది ఒక హత్యగానే కాదు, సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లే చర్యగా పౌర సమాజం చూడాలి. ఎందుకంటే, రాష్ట్రంలో భూస్వామ్య భావజాలం పెరుగుతున్నది చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. అందులో భాగమే బుసలుకొట్టే కుల విషసర్పం. రాష్ట్రంలో ఈ దశాబ్దకాలంగా జరిగిన 128 కులదురహంకార హత్యల్ని పరిశీలిస్తే గనుక రోజురోజుకూ కుల అధిపత్యం పెచ్చుమీరుతోందని తెలుస్తోంది. ఒక బంటి హత్యనే కాదు, మిర్యాలగూడలో పెరుమాండ్ల ప్రణరుని హత్య చేయించిన మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కూతురిని వితంతువుగా, తన మనుమడిని తండ్రిలేని పిల్లవాడిని చేశాడు. ఇందులో మారుతిరావు సాధించిందేమిటి? కులంతో రగిలిపోవడం తప్ప. ఆంబోజి నరేశ్‌తో పాటు తన కన్న కూతురు స్వాతిని బాత్రూమ్‌లో ఉరేసి చంపిన తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చనిపోయాడు. ఏం సాధించాడు? రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. భువనగిరిలో రామకష్ణగౌడ్ ముదిరాజ్ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడని యువతి తండ్రి రామకష్ణ గౌడ్‌ను హత్య చేశాడు. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలంలో రాయపోల్ గ్రామంలో నాగమణి అనే కానిస్టేబుల్ అదే గ్రామానికి చెందిన ఎస్సీ యువ కుడిని ప్రేమించి పెండ్లి చేసుకుందని ఆమె తమ్ముడు పరమేష్ నాగమణిని కిరాతకంగా కారుతో ఢకొీట్టి చంపేశాడు. ఈ వరుస హత్యల్ని చూస్తే కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్నవారి పరిస్థితి ఎంతటి ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల హత్యకు గురైన బంటి కుటుంబాన్ని సర్కారే ఆదుకోవాలి. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు లేదా ఇందిరమ్మ ఇండ్లలో గాని ఒక ఇల్లు మంజూరు చేయాలి. భార్గవి తన తల్లిగారింటిని వదిలి అత్తింట్లోనే ఉంటున్న నేపథ్యంలో వారి కుటుంబపోషణకు ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి. ఒక్క భార్గవికే కాదు, కులాంతర,మతాంతర వివాలు చేసుకున్న వారందరికీ ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. కుల దురహంకార హత్యల్ని అరికట్టేందుకుగాను ఒక చట్టమే తీసుకురావాలి. కులాంతర, మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేలా సాంస్కతిక కళాసంస్థల ద్వారా విస్తతంగా ప్రచారం చేయలి. ఆ వివాహాలు చట్టబద్ధమేనని చాటిచెప్పాలి. వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించాలి. కులాంతర మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటికే కేరళలో వామపక్ష ప్రభుత్వం, తమిళనాడు డీఎంకే సర్కార్ కులాంతర వివాహం చేసుకున్న దంపతుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగమిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నాయి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించాలి.
టి.స్కైలాబ్ బాబు
9177549646