నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రాణం అత్యంత విలువైనదని, రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలను పోగొట్టుకోవద్దని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ పట్టణాన్ని ఆక్సిడెంట్లు, కాలుష్యం లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. శనివారం రాత్రి అయన నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో రద్దీ కారణంగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అందువల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పట్టణ పౌరులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని, అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. నల్గొండ పట్టణంతోపాటు, మిర్యాలగూడ రోడ్డులో సైతం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నదని, ఆక్సిడెంట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అక్కడ కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం అవసరం ఉందని అన్నారు.నల్గొండ పట్టణంలో రద్దీని తగ్గించేందుకు బై పాస్ రహదారులను చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.