వీఓఏల బతుకులు దుర్భరం

Life of VOAs is miserable

– వేతన పెంపు ఫైలు చర్చకొచ్చేనా? పర్మినెంట్‌ అయ్యేనా?
– రూ.3,900 వేతనంతో బతకలేక ఇక్కట్లు
– క్యాబినెట్‌ సమావేశం వైపు ఆశగా ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామ సంఘాల సహాయకులు ఊరికి చైతన్య దీపికలు. మహిళలు పొదుపు చేసుకునేలా ప్రోత్సహించడంలోనూ, సర్కారు నుంచి వారికి రుణాలిప్పించడంలోనూ, తిరిగి కట్టించడంలోనూ సంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఊరికి ఎమ్మెల్యే, మంత్రులొచ్చినా…అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టినా ఇల్లిల్లూ తిరిగి మహిళలందర్నీ కచ్చీరు కాడ పోగేసి విజయవంతం చేస్తారు. మంత్రులు, సీఎం పెట్టే సభలన్నింటికీ బతిమిలాడి..నచ్చజెప్పి ఆడోళ్లను తరలించడంలోనూ వీరిదే కీలక పాత్ర. గ్రామస్థాయిలో ఇంతటి కీలక రోల్‌ పోషిస్తున్న వీఓఏల విషయంలో రాష్ట్ర సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నది. 44 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. జీతాల పెంపు, తదితర డిమాండ్ల పరిష్కారం ఫైలు పెండింగ్‌లో ఉందని మభ్యపెట్టింది. సమ్మె విరమించినా నేటికీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఎన్నికల ముందు చివరి క్యాబినెట్‌లోనైనా తమ వేతనాల సమస్య, పర్మినెంట్‌, డిమాండ్ల పరిష్కారం హామీలు చర్చకు వస్తాయని కొండంత ఆశతో వీఓఏలు ఎదురుచూస్తున్నారు. సర్కారు కరుణిస్తుందా? ఎప్పటిలాగే నిరాశపరుస్తుందా? అనే వేచిచూడాల్సిందే.
రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)లో 17,606 మంది గ్రామ సంఘాల సహాయకులు (వీఓఏలు) పనిచేస్తున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళల్లో ఆర్థిక, సామాజిక చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి వారికి ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పిస్తున్నారు. వాటిని తిరిగి ప్రతినెలా చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల లావాదేవీలన్నింటినీ పుస్తక నిర్వహణ చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ లైవ్‌ మీటింగ్‌ పెట్టి అన్ని సంఘాల వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంతటి పని చేస్తున్న వీరిని తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు రెగ్యులర్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ నిచ్చారు. రాష్ట్రమొచ్చి తొమ్మిదిన్నరేండ్లు దాటుతున్నా ఆ అంశం పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా మరోవైపు సర్కారు రోజుకో కొత్త పనిని అంటగడుతున్నది. వీఓఏలకు కొత్త, కొత్త సర్వేలు చేయాలని ఆదేశిస్తున్నది. చేయనంటే పీకేస్తామని బెదిరిస్తున్నది. ఇన్నేండ్ల నుంచి పనిచేస్తున్నాం ఎప్పటికైనా పర్మినెంట్‌ కాకపోతుందా? అన్న ఒకే ఒక ఆశతో వీఓఏలు కష్టాలను పంటికింద భరిస్తూ పనిచేస్తూ పోతున్నారు. ఇంతజేస్తున్నా కనీస వేతనమైనా దక్కుతుందా? అంటే అదీ లేదు. సెర్చ్‌ నుంచి కేవలం రూ.3,900 గౌరవ వేతనమే లభిస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వారి కుటుంబాలు గడవటం కష్టమవుతున్నది. ఎందరో మహిళల బతుకుల్లో వెలుగులు నింపుతున్న వీఓఏల బతుకులు మాత్రం చీకట్లోనే మగ్గుతున్నాయి.
వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ
వీఓఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. వీఓ గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా సొంత ఖాతాల్లో జమచేయాలి. స్త్రీనిధి ఇన్సెంటివ్‌ పెంచి ఇవ్వాలి. అర్హులైన వారికి సీసీలుగా ప్రమోషన్లు కల్పించాలి. రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. ప్రతి గ్రామ సంఘానికీ ల్యాప్‌ ట్యాప్‌, నెట్‌ సౌకర్యం కల్పించాలి.