పశువుల్ని రక్షించే పేరుతో మనుషుల్ని మృగాలుగా మారుస్తున్నారా? హర్యానా ముఖ్యమంత్రి తీరు చూస్తే అవుననే చెబుతోంది. ”సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగలం” అంటున్నారాయన! ”గోరక్షక” ముఠాల చేతిలో అమాయకుడైన ఆర్యన్‌మిశ్రా దారుణ హత్యోదంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పందన ఇది. ఈ ఘటన పట్ల వెళ్లువెత్తుతున్న విమర్శలకు సమాధానంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయి. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే సవాలు చేస్తున్న ఈ గోదాడుల పట్ల పాలకవర్గాల ఉదాసీనతకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. దశాబ్దకాలంగా దేశంలో ఇలాంటి హింస సర్వసాధా రణమైపోయిందంటే అందుకు కారణం ఈ భావజాలమే కదూ!
పన్నెండో తరగతి చదువుతున్న ఆర్యన్‌మిశ్రా ఓ పందొమ్మిదేళ్ల పిల్లాడు. తన మిత్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. గోమాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో ముప్పయి కిలోమీటర్లు వెంటాడి వేటాడి మరీ కాల్చి చంపారు. ఈ దేశంలో ఆవులకన్న రక్షణ మనుషులకు లేకుండా పోయింది. గోరక్షణ పేరుతో ఓ అమాయకుడైన పసివాడిని పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడా ఆర్యన్ బ్రాహ్మణ బాలుడని తెలిసి బాధపడుతున్నారట! అంటే అతను ఏ ముస్లిమో, క్రిస్టియనో అయితే పర్వాలేదా!! హర్యానా ముఖ్యమంత్రి ”సెంటిమెంట్” వ్యాఖ్యల ”అంతస్సారం” ఇదేనా? అని సీపీఐ(ఎం)నేత బృందాకారత్ ప్రశ్నిస్తున్నారు. ఏలినవారి ఈ భావజాలమే ఆర్యన్ మిశ్రా హత్యకు దారితీసిందని మృతుని కుటుంబం సైతం ఆమెతో గొంతుకలపడం గమనార్హం.
గురువారం ఫరీదాబాద్‌లోని ఆర్యన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం బృందా మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రతినిధులెవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాకపోవడాన్ని ఎత్తిచూపారు. బీజేపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిం చారు. గోవు పేరుతో జరుగుతున్న హత్యలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్ి అమిత్‌షాల మౌనాన్ని నిలదీశారు. మరోవైపు బాధిత కుటుంబం సైతం ”హర్యానా ప్రభుత్వం తమ కుమారుడికి న్యాయం చేస్తుందన్న ఆశ లేదు. ప్రభుత్వం నిందితుడి వెంటే ఉంది. మేము ఒంటరిగా ఉన్నాం” అని బృందా ముందు ఆవేదన చెందడం వారి నిస్సహాయ స్థితికి అద్దం పడుతోంది. ‘నిందితుడు మంచివాడని, పొరపాటున తప్పు చేశాడని, మీరు మౌనంగా ఉండాలని’ పోలీసులు తనతో చెప్పారని ఆర్యన్ తండ్రి సియానంద్ మిశ్రా బృంద ముందు తన గోడును వెల్లడించాడు. ఈ నేపథ్యంలో వారికి పూర్తి న్యాయ సహాయం అందించేందుకు బృందాకారత్ ముందుకు రావడం అభినందనీయం.
సియానంద్ వేదన విన్నవారెవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆలోచింపజేస్తుంది… ”నా కొడుకు హిందువు. ఆయన అయోధ్యకు నడిచాడు. ఢిల్లీ జామా మసీదులో జరిగిన ఈద్ విందులోనూ పాల్గొన్నాడు. అక్కడ తన ముస్లిం స్నేహితులతో కలిసి భోజనం చేశాడు. వాళ్లిచ్చిన ఖర్జూరాలు, జీడిపప్పు ఇంటికి తెచ్చేవాడు. మా పూజా ప్రసాదాలనూ అంతే ప్రేమతో వారికి పంచేవాడు. అలా అన్నదమ్ముల్లా కలిసి బతికేవారిలో ఆవు పేరుతో విద్వేషాలనెందుకు రేపుతున్నారు? ఆవు పేరుతో మనిషిని చంపే క్రూరత్వం ఏ ప్రయోజనాల కోసం? ఆర్యన్ ముస్లిం అని అనుకున్నామని, అతను బ్రాహ్మణుడని తమకు తెలియదని నిందితులం టున్నారు. అంటే ముస్లింలయితే చంపడమేనా? అసలు వారికి మనుషులను చంపే స్వేచ్ఛ ఎవరిచ్చారు?” అంటూ ఆయన గుండెను గొంతులోకి తెచ్చుకుని నిలదీస్తున్నారు. ఎవరు ఏమి తినాలో నిర్ణయించే హక్కు వీరికెక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రశ్నలు వృధాకాకూడదు. మస్తిష్కాల్లో విద్వేషాన్ని నింపుకొని, ధర్మం పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ఈ స్వయంప్రకటిత గోరక్షక ముఠాలతో దేశానికి మహా ప్రమాదమని హెచ్చరిస్తున్న ఈ ప్రశ్నలు సమాధానాలు లేనివిగా మిగిలిపోకూడదు. ఈ మతపరమైన అసహనాలు, మనిషిని మనిషిని విడదీసే కరూర పరిహాసాలు ఇలాగే కొనసాగుతుంటే.. మనమింకా సంజాయిషీలమో, సముదా యింపులమో కాకూడదు. సమాధానాలం కావాలి. లేదంటే నిత్యం విభజన గోడల మధ్య, భయాల నీడల మధ్య జీవితాలే ప్రశ్నార్ధకమవుతాయి.