నా మౌనం..ఒక మహా నినాదం
నా భావుకత..ఒక పురోగమన సోపానం
నా అంతరంగం..ఒక చైతన్య స్రవంతి
నా ప్రశాంత వదనం,
లోలోపలి పొరల్లో భూకంపకేంద్రం
నా సుప్తశక్తి..అంతర్గత సంఘర్షణకు ఇంధన వనరు
నా సున్నిత స్పందనాతత్వం..
ఈ సృష్టిని వెలిగించే చైతన్యదీపం
నా ప్రశాంత మానస నదీ ప్రవాహం అలలు,
అలజడులు సృష్టించే సముద్ర తుఫాను కేంద్రకం
నా జోలపాట..ఒక విప్లవగీతం
నా నిశ్చలతత్వం..ఒక మహా విస్ఫోటనా కేంద్రం
నీకు కనపడేది స్వీయ భ్రమణం మాత్రమే!
దాంతోపాటు కలగలిసి ఉన్నది సమాజ పరిభ్రమణం!!
నిశ్చలంగా, మౌనంగా, ప్రశాంతంగా ఉన్న నాకు గాక
నీ గావుకేక ఇంకెవరికి స్పష్టంగా వినిపిస్తుంది?
అయితే…నా మధుర సంకీర్తన
నీ కన్నీటి సెలయేర్లను ఆపగలదా?
అందుకే…దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా చెలరేగే
నా తాండవ పద ఘట్టనల రాపిడితో
నీ అనర్గళ అఖండజ్యోతిని వెలిగిస్తా!
అది అనంత వెలుగుల
సౌహార్ద జీవనవాహినిగా కొనసాగనీ!!
– గిరిధర్, 9849801947