రవిశాస్త్రికి జీవనసాఫల్య పురస్కారం

– ఉత్తమ క్రికెటర్లుగా గిల్‌, దీప్తి, అశ్విన్‌, బుమ్రా, మంధాన
హైదరాబాద్‌ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల్లో టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ రవిశాస్త్రి జీవనసాఫల్య పురస్కారం అందుకున్నాడు. నాలుగేండ్ల తర్వాత తొలిసారి జరిగిన అవార్డుల వేడుకలో గత సీజన్ల పురస్కారాలను సైతం అందజేశారు. ఉత్తమ క్రికెటర్‌గా పాలీ ఉమ్రీగర్‌ అవార్డును శుభ్‌మన్‌ గిల్‌ (2022-23), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2021-22), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020-21), మహ్మద్‌ షమి (2019-20), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2018-19) అందుకున్నారు. మహిళల విభాగంలో దీప్తి శర్మ (2022-23, 2019-20), పూనమ్‌ యాదవ్‌ (2018-19), స్మృతీ మంధాన (2021-22) ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. భారత, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు సహా బీసీసీఐ కార్యదర్శి జై షా, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు హాజరయ్యారు.