సస్పెన్షన్‌ ఎత్తివేయండి

నవతెలంగాణ-హైదరాబాద్‌
హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌ మాజీ ఓఎస్డ్‌ హరికృష్ణపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను సస్పెండ్‌ చేశారని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ పి. కార్తీక్‌ సోమవారం విచారణ జరిపారు. ఫిర్యాదు లేకుండానే హరికృష్ణపై సస్పెన్షన్‌ విధించారన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించారు. సస్పెన్షన్‌పై విచారణ కమిటీ సైతం ఆధారాలు సమర్పించలేదని తేల్చారు. గతేడాది ఆగస్టులో హరికృష్ణపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్ర మంత్రి ఆదేశాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. నిరాధార ఆరోపణలతో సస్పెండ్‌ చేశారని హరికృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
కాళేశ్వరంపై విచారణ వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై దాఖలైన పిల్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారించాలనీ, మెఘా, ఎల్‌అండ్‌టి ప్రాజెక్టులతో కుదుర్చుకున్న ఒప్పందాలను సమర్పించేలా ఆదేశాలు జారీ చేసి డీపీఆర్‌ ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని విశ్వనాథరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని పిటిషనర్‌ లాయర్‌ కోరారు. పిల్‌లో పొరపాట్లు ఉన్నాయని చెప్పిన హైకోర్టు వాటిని సవరించి తిరిగి దాఖలు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.