– రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు..చల్లబడ్డ వాతావరణం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐద్రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. మంగళవారం రాష్ట్రంలో మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్‌లో అత్యధికంగా 1.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేమానులో అత్యధికంగా 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో మాత్రం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు, మూడు డిగ్రీల మేర తగ్గే అవకాశాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందనీ, గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.