ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్… ఇలా రెండు రకాల భావోద్వేగాలుంటాయి. అయితే పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. మహిళలకు ఈ సమస్య మరీ ఎక్కువ. ముఖ్యంగా పని చేసే చోట ఇలాంటి భావోద్వేగాలు అస్సలు ప్రదర్శించకూడదంటున్నారు నిపుణులు. లేదంటే వాటి ప్రభావం మన కెరీర్‌పై పడే అవకాశాలున్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం…
అబ్బబ్బా… ఎంత చేసినా ఈ పని మాత్రం అయిపోవట్లేదు. దీనికి తోడు ఎవరైనా రాకపోతే వారి పనీ నేనే చేయాలి అంటూ కోపం తెచ్చుకుంటుంటారు కొంతమంది. అయితే దీనివల్ల నిరాశానిస్పృహలు అవహించడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ఇక ఆ సమయంలో ఎవరు మాట్లాడించినా ఆ కోపాన్నంతా వారిపై చూపిస్తుంటారు. ఇలాంటి ధోరణి పని చేస చోట అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఇటు మీ పనీ పూర్తి కాదు… అటు ఇతరులతోనూ అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. కాబట్టి పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించాలి. ఈరోజే కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులేంటో చూసుకొని మీకున్న సమయంలోనే వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత సమయం ఉంటే మిగతా పనులు చేయడం, లేదంటే వాటిని మరుసటి రోజు పూర్తి చేయడం… ఇలాంటి చిన్న చిన్న ప్రత్యామ్యాయ మార్గాల్ని అనుసరిస్తే పని ఎక్కువగా ఉందన్న చికాకు మీపై పడకుండా ఉంటుంది.
బాధపడుతున్నారా..?
మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారికి కూడా ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలుంటాయి. అయితే కొందరు ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక సతమతమవుతుంటారు. ఈ భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేక అక్కడే ఏడ్చేస్తుంటారు. కానీ ఇలా సహౌద్యోగుల ముందు, పై అధికారుల ముందు ఏడవడం వల్ల వారికి మీరు చులకనయ్యే అవకాశముంది. కాబట్టి సమస్య ఏదైనా భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడం, వాటి ప్రభావం మీరు చేసే పనిపై పడకుండా చూసుకోవడం ఉత్తమం. మరీ అంతలా బాధనిపిస్తే మీకు కాస్త క్లోజ్‌గా ఉన్న సహౌద్యోగులతో లేదంటే మీ కుటుంబ సభ్యులతో పంచుకొని దాని పరిష్కారం కోసం వారి సహాయం తీసుకోవడంలో తప్పు లేదు.
ఈర్ష్యాద్వేషాలకు దూరంగా…
ఆఫీసన్నాక అందరు ఉద్యోగులూ ఒకే రకంగా పని చేయాలని, అందరి ఆలోచనలూ ఒకే తరహాలో ఉండాలని రూలేం లేదు. కొందరికి పని విషయంలో ఉత్తమమైన ఆలోచనలు రావొచ్చు. దాంతో వారు పై అధికారుల మెప్పు పొందవచ్చు. మరికొందరు తటస్థంగానే ఉండచ్చు. అయితే ఇలా సహౌద్యోగుల్ని ప్రశంసించేటప్పుడు కొందరు వారిపై అసూయ పడుతుంటారు. ‘అబ్బా… ఆ మాత్రం పనికే పొగడాలా..’ అంటూ వారిపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటుంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల ఇతరులకు మీపై చెడు అభిప్రాయం కలగడం తప్ప మరే ప్రయోజనాలు ఉండదు. కాబట్టి సహౌద్యోగుల విషయంలో ఇలా ఆలోచించడం మాని.. మీకు తెలియని విషయాలు వారి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోవాలి.
మనసు పాడుచేసుకోవద్దు
పై అధికారులు అప్పగించిన పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోయినా, పని చేయడానికి పెట్టుకున్న డెడ్‌లైన్లో అది పూర్తవ్వకపోయినా, అందులో తప్పులున్నా చాలా మంది ఉద్యోగుల మనసుల్లో అపరాధ భావం మెదులుతుంటుంది. అయితే దీని ప్రభావం ఆ తర్వాత మనం చేసే పనులపై పడడంతో పాటు… అది మన మనసునూ కుంగదీస్తుంది. కాబట్టి మీలో ఉన్న అపరాధ భావాన్ని వెంటనే తొలగించడం మంచిది. ఇందుకోసం పదే పదే దాని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కాకుండా అనుకున్న సమయంలో పని పూర్తిచేయలేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫలితంగా మరోసారి ఈ భావన మనసులోకి రాకుండా పనిపై పూర్తి ఏకాగ్రత్త నిలిపి దాన్ని శ్రద్ధగా చేయగలుగుతాం.
అభద్రతా భావం వద్దు
కొత్తగా ఉద్యోగంలో చేరినా, అందులో కొన్నేండ్ల అనుభవం గడించినా కొందరికి వారు చేసే ఉద్యోగం పట్ల అభద్రతా భావం ఉంటుంది. పని విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోవడం, ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుకోవడం… వల్ల ఈ సమస్య వస్తుంది. తద్వారా మీపై మరింత ఒత్తిడి పడి, చేస్తున్న పని కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి పని విషయంలో అప్‌డేట్‌గా ఉండడం, పోల్చుకోవడం మాని మీకు తెలియని విషయాలను సహౌద్యోగులను అడిగి తెలుసుకోవడం వల్ల అభద్రత మీ దరి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే కెరీర్‌లోనూ రాణించవచ్చు.
కలిసి మెలిసి ఉండండి
కొంతమంది మన పనేదో మనది ఇతరులతో అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. కానీ కొన్ని పనులకు ఇతరుల సహాయం అవసర ఉన్నా, లేకపోయినా… మరికొన్ని పనులు బృందంతో కలిసి చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు సహౌద్యోగులతో సులభంగా కలిసిపోతేనే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి అందరితో కలిసిపోతూ మీకు సందేహం ఉన్న విషయాల్లో సహౌద్యోగుల సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా వాళ్లతో చెలిమి పెరుగుతుంది. మీకూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు.