రేవంత్‌ తీరు గోబెల్స్‌ మాదిరిగా వందసార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు

– మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్న తీరు హిట్లర్‌ ప్రచారశాఖ మంత్రరి గోబెల్స్‌ను తలపిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 61 వేలు పోస్టులు భర్తీ చేశామనీ, పోలీస్‌ శాఖలోనే 30,731 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. మరో 16 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ, రాత పరీక్షలు,, ఫిజికల్‌ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసినట్టు గుర్తుచేశారు. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాటి భర్తీ ప్రక్రియ పూర్తిగా బీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగిందని తెలిపారు. గ్రూప్‌ 1 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆకాంక్షలను కాలరాసిన కాంగ్రెస్‌ను సమాజం క్షమించదనీ, నిరుద్యోగులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.