కాలం ఒక దారం
దానికి గుచ్చిన పువ్వులే నా కవితలు.
ఆ దారానికి కొసలు లేవు
ఎక్కడ మొదలైందో
ఎక్కడ ముగుస్తుందో అనూహ్యం.
సుదీర్ఘమైన దండలో
ఎన్ని రకాల పూలో
కొన్నింటికి ముళ్లు కూడా.
కాలం గాలి కాదు
అది సకల జీవుల ఊపిరి
వర్షం నీరు కాదు
అనాది అనాది కన్నీరు.
వేదన నా జీవితంలో భాగం
ధిక్కారం నా ఏకైక రసం
ఇది పునరావృత గీతం కాదు
ఎప్పటికీ వొడువని నేపథ్య సంగీతం
పింగాణి కెటిల్ లోంచి
జారే కాఫీ ధార
ప్రస్తుతానికిదే
నా నయాగరా
– డా. ఎన్. గోపి