దున్నపోతు మీద వాన పడ్డట్టు

On the plough
It's rainingకొందరు ‘మిన్ను విరిగి మీద పడ్డా మిన్నకుంటరు’. ఏ ఉపద్రవం వచ్చినా చలించరు. అంటే భయం లేని తనం అన్నట్టు. నిదానం అని కాదు కానీ, ఒకింత సోమరితనమే. వీల్లను ‘జాగు మనుషులు’ అంటరు. అట్లాంటోల్లు అక్కడక్కడా వుంటరు. అందుకే వాడు ‘దున్న పోతు మీద వాన పడ్డట్టు’ వున్నడు అంటరు. ఇక్కడ దున్నపోతుకు వర్షం చల్లగ వుంటది. హాయిగ కూడా వుండవచ్చు. కాని మనిషన్నవాడు వాన కురిస్తే ఇంట్లకు ఉరికి రావాలి కాని అట్లనే వుండేవాడు అన్న రీతిలో ఈ సామెత వాడుతరు. ఇటువంటి వాల్లనే ‘వాడు ఉలకడు పలకడు’ అని కూడా అంటరు. వీల్లు స్వంతంగా ఆలోచించకుండా వుంటరు. వీల్లనే ‘తానా అంటే తందానా బాపతుగాడు’ అంటరు. బుర్ర కథలో తానా అంటు బుర్రలు కొడుతూ పాడుకుంటూ తందానా అంటూ అటు ఇటు చెప్పేవాళ్లు వుంటరు. వీల్లు ఎట్లా వుంటారంటే ‘తిన్నావురా బసవన్న అంటే తిన్న, పన్నావుర బసవన్న అంటే పన్న’ అని తలకాయ ఊపే ఎద్దులాగా వుంటరు. వీల్లు అన్నిటికీ తలకాయ ఊపుడే పని. ఇంకేం పని చేతకాదు అన్నట్టు. ఏం పట్టించుకోకుంట ఇంట్ల బయట ఏం పని చేయకుండా ఉండేవాల్లను కూడా ‘ఆయన ఏం చెయ్యడు, నమో నారాయణ లెక్క’ ఉన్నడు అంటరు. ఇంకా కొందరు ఎడ్డెడ్డి కనిపిస్తరు గని లోపల ఉషారుతనం వుంటది. వాల్లను ‘కదలడు మెదలడు గల్మకు అడ్డం పంటడు’ అంటరు. గల్మ అటే ముందు దర్వాజ అన్నట్టు. ఆ ద్వారంలో కూర్చుని పోకుంట రాకుంట అడ్డం వుంటడు అన్నట్టు. ఇలాంటోల్ల పని కూడా ‘యాడ ఏసిన గొంగడి గాన్నె’ అంటరు. గొంగడి ఎక్కడ ఏస్తే అక్కనే వుంటది. కాని ఆవులను, మేకలను మేపేందుకు ఆ మనిషి ఎటు కొట్టుక పోతలేడని అర్ధంలో వాడుతరు. నిదానంగా అన్నట్టు అన్పిస్తరు కాని ఏ పని పాట చెయ్యక వుండేవాల్లు కొందరు ఉంటరు. ఏం మాట్లాడరు. వాల్లను ‘నారు ముచ్చులోని లెక్కన వున్నడు’ అంటరు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479