ధోనికి లైన్‌ క్లియర్‌

Line clear for Dhoni– పాత రూల్‌ మళ్లీ తెచ్చిన బీసీసీఐ
బెంగళూర్‌: భారత క్రికెట్‌ దిగ్గజం ఎం.ఎస్‌ ధోని ఐపీఎల్‌ కెరీర్‌పై కొన్ని సీజన్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 43 ఏండ్ల వయసులో మహేంద్రుడు మరొక సీజన్‌ అంటూ ప్రతిసారి అభిమానులను థ్రిల్‌కు గురి చేస్తున్నాడు. ఈ ఏడాది ఆటగాళ్ల మెగా వేలం ముంగిట ధోని నిలుపుకునే అంశంపై చెన్నై సూపర్‌కింగ్స్‌ డైలామా ఎదుర్కొంది. ఐదేండ్లుగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్ల కోసం బీసీసీఐ 2021లో రద్దు చేసిన రూల్‌ను ఈ ఏడాది తిరిగి తీసుకొచ్చింది. ఆ ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్‌ జాబితాలో చేర్చింది. వేలంలో అందుబాటులోకి రావటంతో పాటు రూ.4 కోట్లకు అట్టిపెట్టుకునే అవకాశాన్ని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కల్పించింది. 2022 వేలంలో ధోనిని రూ.12 కోట్లకు రెండో ఆటగాడికి చెన్నై సూపర్‌కింగ్స్‌ నిలుపుకుంది. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ తర్వాత ధోని మళ్లీ భారత జట్టుకు ఆడలేదు. ఈ ఏడాది రుతురాజ్‌ గైక్వాడ్‌కు సూపర్‌కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన ధోని జట్టులో ఆటగాడిగా కొనసాగాడు. రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంటే.. ధోని వేలంలోకి వచ్చే అవకాశం లేదు.