– భూముల బదలాయింపునకు రక్షణ శాఖ ఓకే
– హైదరాబాద్- రామగుండం-నాగ్‌పూర్ హైవేకూ గ్రిన్‌సిగల్
– ఉత్తర తెలంగాణకు విస్తరించనున్న రవాణా సదుపాయాలు
– కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్‌క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖ రాసిన సంగతీ తెలిసిందే. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం అంగీకరించింది. వెంటనే అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివద్ధికి అత్యంత కీలకమైన అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్-రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి విజప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామనీ, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్య త్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్య మంత్రి విజప్తి చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన అను మతులతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివద్ధికి మార్గం సుగమ మైంది. అటు నిజా మాబాద్, ఆదిలాబాద్, ఇటు కరీంనగర్. రామగుండం వెళ్లేందుకు సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోనుంది. హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంతో గ్రేటర్ సిటీ ఉత్తర దిశగా అభివద్ది పరుగులు తీయనుంది. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అడ్డంకిగా మారిన రక్షణ శాఖ భూముల అడ్డంకులు తొలిగిపోయాయి. గత ప్రభుత్వం కేంద్రంతో అనుసరించిన అహంకార పూరిత వైఖరితో సంవత్సరాల తరబడి ఎలివేటేడ్ కారిడార్ల అనుమతి ప్రక్రియ నిలిచింది.
సంతోషంగా ఉంది:సీఎం
ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటం పట్ల సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 80 రోజుల కొత్త ప్రభుత్వం ఈ అనుమతులు సాధించటం తమ చిత్తశుద్ధిని చాటిందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తెలంగాణ రాష్టానికి సాధించుకోవాల్సిన అవసరాల కోసం కేంద్ర మంత్రులను కలిసి లేఖలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా, ఎన్నిసార్లయినా కలిసేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర అభివద్ధి కోసం కేంద్రంతో సన్నిహిత, స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయ వైషమ్యాలు, పార్టీల సిద్ధాంతాలేవైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు త్వరలోనే ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు.