– బడ్జెట్‌లో ఇచ్చింది రూ. 500 కోట్లే
– గతేడాదీ చేసిన ఖర్చు రూ. 600 కోట్లు
– త్వరితగతిన పూర్తయ్యేనా..?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం చుట్టూతా నిర్మించతలపెట్టిన ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో కదలిక రానుంది. భూసేకరణ ప్రక్రియకు ఇప్పటికే లైన్‌క్లియర్ అయింది. కాగా పూర్తిచేసేందుకు మాత్రం భారీ నిధులు అవసరం ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట ప్రారంభించాయి. నిధులు ఒకేసారి ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయి టెండర్లు సైతం పిలిచారు. దీనికి 6,480 కోట్లు కాగా, 182 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే ఉత్తర భాగానికి రెండు నెలల క్రితం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. దీనికి 158 కిలోమీటర్లకుగాను రూ.9,164 కోట్లు అవసరమవుతాయి. రెండు భాగాలు కలిపి 340 కిలోమీటర్లు. దీనికి రూ.17 వేల కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇందులో భూసేకరణే అత్యంత కీలకం కానుంది. ఎనిమిది లైన్ల రింగురోడ్డు నిర్మాణానికి అయ్యే భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టేందుకు అవసరమయ్యే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కేటాయించలేదు. తొలుత కేవలం రూ.100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసింది. విడతల వారీగా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ నిధులు ఆ ప్రాజెక్టు భూసేకరణకు ఏమాత్రం సరిపోవని ఆ శాఖా అధికారులే చెబుతున్నారు. సుమారు రూ.1400 కోట్లు ఇస్తే తప్ప, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదని అంటున్నవారూ ఉన్నారు.
50 శాతం చొప్పున
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుండగా, భూసేకరణకు అయ్యే ఖర్చును మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భరించాల్సి ఉంటుంది. గతేడాది 2021-22 బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.600 కోట్లు ఖర్చుచేసినట్టు సవరించిన బడ్జెట్ అంచనాల్లో సర్కారు పేర్కొంది. మిగతా రూ. 150 కోట్లను ప్రభుత్వం ఇంకా వ్యయం చేయలేదు. గత ఏడాది మాత్రం రూ.500 కోట్లు ఇచ్చింది.
4700 ఎకరాలు అవసరం
వాస్తవానికి ఉత్తరభాగం ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి సుమారు 4700 ఎకరాల భూమి కావాలి. దీనికోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రూ. 2000 కోట్ల చొప్పున వ్యయం చేయాలి. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు, ఖర్చును పరిశీలిస్తే, పూర్తిస్థాయిలో వ్యయం చేసినా ఇంకో రూ.1100 కోట్లు భూసేకరణకు అవసరం కానున్నాయి. ఇప్పటికే ఈ ఉత్తరభాగం ప్రాజెక్టుకు రూ. 9,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, నిధులు ఆలస్యంగా ఇస్తే, ఆ వ్యయం సైతం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిధులను ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు ప్యాకేజీల్లో..
ఒప్పందం తర్వాత తొలివిడతలో సంగారెడ్డి నుంచి తూప్రాన్ వరకు 60 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రంగం సిద్దమవుతున్నది. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించాలని కేంద్రం నిర్ణయించింది. పనులను వేగంగా పూర్తిచేసేందుకు ప్రతి 30 కిలోమీటర్లను ఒక ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవనున్నారు. దీనికోసం 260 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆయా భూయజమానులకు నోటీసులు జారీచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన ప్రతిసారి కొంతమేర భూసేకరణ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తున్నది. ఈమేరకు ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర ఉపరితల రవాణాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో తొలుత నిర్మించే 60 కిలోమీటర్లకు భూసేకరణ చేసుకున్నాయి.
కొత్త నోటిఫికేషన్లు
ఉత్తరభాగం 182 కిలోమీటర్ల రహదారిని 11 భాగాలుగా విభజించి ఆ మార్గంలో సర్వే నిర్వహించి భూయజమానులకు గుర్తించేందుకు నాలుగు విడతలుగా కేంద్రం నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తిచేసి భూసేకరణకు వీలుగా తుది నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంది. జోగిపేట, యాదాద్రి, చౌటుప్పల్ ప్రాంతాల రెవెన్యూ అధికారుల పరిధిలో సర్వే నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకే తుది నోటిఫికేషన్ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసి రెండునెలలైంది.